మృతదేహాల తరలింపునకు ఫ్రీ అంబులెన్స్లు

19 Nov, 2016 03:15 IST|Sakshi
మృతదేహాల తరలింపునకు ఫ్రీ అంబులెన్స్లు

గాంధీ ఆస్పత్రిలో 50 వాహనాలను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్: నిరుపేద రోగుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు 50 ఉచిత మార్చురీఅంబులెన్స్లు..‘హెర్సే’ అందుబాటులోకి వచ్చారుు. శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం మెహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, టి.పద్మారావుతో కలసి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించారు. 11 వాహనాలను బ్యాకప్‌గా ఉంచామని, అవసరమైతే మరిన్ని సమకూర్చుతామని లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలు నిచిత్స పొందుతూ మరణిస్తే... వారి మృతదేహాలను ఈ ప్రత్యేక అంబులెన్సుల్లో తరలిస్తారన్నారు. ఆర్థిక స్థోమత లేక మృతుని కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు తనను కలచివేశాయని, అందుకే వీటిని ప్రవేశపెట్టామని తెలిపారు.

 రిఫరల్‌పై కచ్చితమైన రిపోర్ట్...
పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల నుంచి ఇతర పెద్ద ఆస్పత్రులకు రోగులను రిఫర్ చేస్తే కచ్చితమైన వివరాలు పొందుపర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నప్పటికీ అక్కడి వైద్యులు నిర్లక్ష్యంతో రోగులను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కరుణ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు