కరెంట్‌ సరే.. నీరెక్కడ..?

14 Feb, 2018 14:56 IST|Sakshi

24 గంటల విద్యుత్‌తో బావుల్లో అడుగంటిన జలాలు

ఎండుతున్న పొలాలు

ఆందోళనలో రైతులు

వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరాతో రైతుల ఇక్కట్లు తీరుతాయనుకుంటే మరింత పెరిగాయి. నిరంతర విద్యుత్‌తో రైతులందరూ విచ్చలవిడిగా విద్యుత్‌ మోటార్లను ఉపయోగిస్తుండడంతో బావుల్లోని నీరు అడుగంటింది. నీటి కోసం రైతులు గంటల తరబడి బావుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ ఉన్నా.. బావుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి.

కరీంనగర్‌ (రూరల్‌) : కరీంనగర్‌ మండలంలో ఈ రబీ సీజన్‌లో 6500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదలతో పలువురు రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఒకవైపు కాలువ నీరు, మరోవైపు నిరంతర విద్యుత్‌ సరఫరాతో ఈ రబీ సీజన్‌లో పంటలు పండుతాయని ఆశించిన రైతాంగానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. గత నెల 25నుంచి మొదటి విడత కాలువ నీరు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4విడతలుగా ఆయకట్టు చివరి రైతులకు నీరందని దుస్థితి. గతేడాది వర్షభావ పరిస్థితులతో బావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి.

ఉపయోగపడని నిరంతర విద్యుత్‌
గత నెల 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. నిరంతర విద్యుత్‌ సరఫరాను చేసేందుకు వీలుగా 10సబ్‌స్టేషన్లలో ప్రత్యేకంగా పీటీఆర్‌లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ మండలంలో మొత్తం 8వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటాయి. విద్యుత్‌ ఉన్నా.. పలువురు రైతుల వ్యవసాయ బావుల్లోని నీరు రెండు,మూడు గంటలకే సరిపోతున్నాయి. మళ్లీ నీటి కోసం ఐదారు గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి. బావుల్లో సరిపడే నీరు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు పొలమంతా పారే పరిస్థితి లేక ఉన్న నీటితో సగం పొలానికి మాత్రమే ఉపయోగిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. కొందరు రైతులు చివరి ప్రయత్నంగా పంటలను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీయిస్తుండగా.. మరికొందరు సైడ్‌బోర్లు వేయిస్తున్నారు.

గొర్రెలు మేపుతున్నా
ఎకరం పొలంలో వరి నాటు వేశా. బావిలో నీరు లేక పొలాలన్నీ ఎండుతున్నాయి. వంతులవారీగా సరిపడే నీరందకపోవడంతో 30గుంటలు విడిచిపెట్టి మిగిలిన 10గుంటలకు నీరు పెడుతున్నా. గొర్రెలకు మేత లేక ఎండిన పొలంలో వారం రోజుల నుంచి గొర్రెలను మేపుతున్నా.
– కూకట్ల ఎల్లయ్యయాదవ్, రైతు, మొగ్ధుంపూర్‌

బావిలో నీరు లేక..
ఎకరం 20గుంటల్లో వరి నాటేశా. నీరు సరిపోవడం లేదు. కరెంట్‌ ఉన్నా బావిలో నీరు లేదు. మోటార్‌ పెట్టిన రెండు గంటలకే అయిపోతున్నాయి. పొలమంతా పారక 20గుంటలు విడిచిపెట్టా. చివరి వరకు మిగిలిన ఎకరం పొలం కూడా పారుతదో లేదో తెలుస్తలేదు.
– మైలారం నాగరాజు, రైతు, మొగ్ధుంపూర్‌

>
మరిన్ని వార్తలు