చేప.. ఎంతకీ పెరగక!

18 Mar, 2020 02:17 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ 

చెరువుల్లో పోసి 8 నెలలైనా.. అరకిలో కూడా పెరగని వైనం 

ఎదుగుదల లేని చేపలకు మార్కెట్లో ధర, డిమాండ్‌ కరువు 

ఉపాధికి గండిపడి.. దిగాలుపడుతున్న మత్స్యకారులు 

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. చెరువుల్లో పోసిన చేపపిల్లలు ఎనిమిది నెలలైనా అరకిలో పరిమాణానికి కూడా పెరగకపోవడంతో మత్స్యకారులు దిగాలు పడుతున్నారు. నాణ్యత లేని చేపపిల్లల్ని పంపిణీ చేయడమే ఇందుకు కారణమని మత్స్యకారులు అంటుండగా, ఫీడింగ్‌ లోపాలే కారణమని అధికారులు అంటున్నారు.  

జీవన ప్రమాణాలు పెంచాలని.. 
మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ను అటు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఇటు మత్స్య సంపద కేంద్రాలుగా మార్చడం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు చేపపిల్లలను చెరువుల్లో అట్టహాసంగా వదిలారు. అయితే, ఈ చేపపిల్ల ల్లో ఎంతకీ ఎదుగుదల లేదు. దీంతో ఇవి పెరిగాక పట్టుకుని మార్కెటింగ్‌ చేసుకోవడం ద్వారా ఉపాధి పొందాలనుకుంటున్న మత్స్యకారుల ఆశలకు గండి ప డుతోంది.

తమను ఆదుకోవాలనే ఉద్దే శంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి నా చేపలు పెరగకపోవడంతో నష్టాల పా లుకావాల్సి వస్తోందని వారంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకున్న చేపపిల్లలు 8 నెలల్లో కనీసం కిలో నుంచి రెండు కిలోల వరకు పెరిగాయని, ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలు అరకిలో కూడా పెరగలేదని అంటున్నారు. పెరిగిన చేపల్ని పట్టే వారికిæ కిలోకు రూ.10 – రూ. 15 ఇవ్వాలని, దీనికి తోడు లారీ, ఐస్, బాక్సులు, కూలీలకు కలిపి కిలోకు రూ.80 వరకు ఖర్చవుతుందని, ఇంత చేసినా ఈ పెరగని చేపల ధర రూ.60 – రూ.80 మించడంలేదని వాపోతున్నారు. 

చిన్న చేపలకు డిమాండ్‌ తక్కువ 
మార్కెట్‌లో చేపలు అమ్మాలన్నా, కొనాలన్నా వాటి కనీస సైజును బట్టి ధర పలుకుతుంది. కిలో కంటే తక్కువున్న వాటికి ధర, డిమాండ్‌ తక్కువ. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా పోస్తున్న వాటిలో ఎక్కువగా రవ్వ, బొచ్చ వెరైటీలు ఉన్నాయి. నిజానికి మార్కెట్‌లో ఈ రకాలకు డిమాండ్‌ ఎక్కువ. రవ్వ కిలో రూ.140 – రూ.200, బొచ్చ రూ.150 – రూ.220, కొర్రమీను రూ.450 – రూ.650 ధర పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం పోసిన చేపలు అరకిలో కూడా తూగడం లేదు. దీంతో అంత ధరరాక, అయినకాడికి అమ్ముకుంటున్నట్టు మత్స్యకారులు వాపోతున్నారు. కష్టపడి చేపలు పడుతున్నా.. వాటికి కనీస ధర రావట్లేదని, అలాగని చెరువుల్లోనే ఉంచితే చనిపోతున్నాయని అంటున్నారు. 

అధికారులు ఏమంటున్నారంటే.. 
చేపపిల్లల్లో నాణ్యతంటూ ఏమీ ఉండదని, ఆశపడి పిల్లలు ఎక్కువగా పోసినా పెరుగుదలలో తేడా వస్తుందని, దాణా సరిగా ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు. నాణ్యతపై అనుమానాలుంటే, విచారణ జరిపిస్తామని అంటున్నారు.

చిన్న చేపలు కొనడం లేదు 
ప్రభుత్వం ఉచితంగా పోసిన చేపపిల్లలు ఏడు నెలలైనా కనీసం అరకిలో కూడా పెరగడం లేదు. చిన్నసైజు చేపల్లో ముళ్లు ఎక్కువ ఉంటాయని ప్రజలు కొనడం లేదు. 
– జి.గణేష్, సిరిసిల్ల, మత్స్యకారుడు 

నాణ్యతలేకే ఇలా.. 
చేపపిల్లల్లో నాణ్యత లేకే ఎదగడం లేదు. మత్య్సకారుల మంచి కోసమే చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి.  
– కనకయ్య, సిద్దిపేట, మత్స్యకారుడు 

చెరువును బట్టి చేపలు వదలాలి 
చెరువును బట్టి చేపపిల్లలు పోస్తే బాగుంటుంది. ఇష్టానుసారం చెరువుల్లో వదలడం వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చేపల్లో కొన్ని సోడిపట్లపోతున్నాయి.  
– శ్రవణ్‌కుమార్, భిక్షపతి చేపల వ్యాపారి

మరిన్ని వార్తలు