ఇది ఆరంభం మాత్రమే..

13 Jun, 2014 00:24 IST|Sakshi
ఇది ఆరంభం మాత్రమే..

 హుడాకాంప్లెక్స్: అధికారంలోకి వచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను మర్చిపోయారని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యపై ఇప్పటి వరకు చర్చ లేదని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఫీజులూం చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామన్ మ్యాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు జంగయ్యయాదవ్ కొత్తపేట చౌరస్తాలో నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డిలు పండ్ల రసాలు ఇచ్చి విరమింపజేశారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ప్రారంభమైనా ఉచిత విద్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంతోమంది తమ చదువులు మధ్యలోనే ఆపే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు భారీ ఎత్తున ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో ఎంతోమంది విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు.
 
ఉచిత విద్యపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అసెంబ్లీలో కూడా దీనిపై చర్చిస్తానని తెలిపారు. జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్ష ప్రారంభమేనని ఉచిత విద్య అందజేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఫౌండేషన్ సభ్యులు రమావత్ లక్ష్మి, సతీష్, కిషోర్, గుజ్జ కృష్ణ, సి.రాజేందర్, బ్రహ్మంచౌదరి, ఐలేష్ యాదవ్  పాల్గొన్నారు.
 
పార్టీలు మారాల్సిన అవసరంలేదు

తాను టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని వచ్చిన కథనాలు అవాస్తవమని, కొందరు గిట్టనివారు ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజీనామా పట్ల వస్తున్న కథనాలపై విలేకరులు ఆయనను ప్రశ్నించడంతో ఈ విధంగా తెలిపారు. 40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందానని, పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
 
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: డీఈఓ సోమిరెడ్డి
జంగయ్య యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష ను విరమింపజేసిన రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్షపై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని,  త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు