‘అంతర’ వచ్చిందోచ్‌..!

12 Jul, 2019 11:01 IST|Sakshi
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘అంతర’ ఇంజక్షన్‌ ఇదే... 

గర్భనిరోధానికి ‘అంతర’ ఇంజిక్షన్‌ 

ప్రవేశ పెట్టిన వైద్య ఆరోగ్యశాఖ

మూడు నెలలపాటు పనిచేయనున్న మందు

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా పంపిణీ

సాక్షి, మంచిర్యాల: తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే దంపతులకు శుభవార్త. మాటిమాటికీ మందు బిల్లలను వాడడం, ఇతరత్రా పద్ధతులు వాడాల్సిన బాధ తప్పనుంది. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించే వారి కోసం గురువారం నుంచి జిల్లాలో కొత్త విధానానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నాంది పలికింది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తి ఉచితంగా.. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌ లేని ‘అంతర’ ఇంజిక్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది.

జాయింట్‌ కలెక్టర్‌ వై.సురేందర్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భీష్మ, అంతర ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్‌ నీరజ జిల్లాకేంద్ర ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంచిర్యాల పట్టణానికి చెందిన నగునూరి సౌజన్య, యాదగిరి దంపతులకు కవల పిల్లలు పుట్టగా.. మూడేళ్ల వరకు తాత్కాలిక గర్భనిరోధక మందులు వాడాలని వైద్యులు సూచించారు. మొదటి ఇంజిక్షన్‌ను సౌజన్యకు వేసి జిల్లాలో అధికారికంగా ఈ అంతర ఇంజక్షన్‌ను ప్రారంభించారు. నూతన జంటలకు ఎడం కావాల్సిన వారికి ఈ ఇంజక్షన్‌ ఒక వరంగా మారనుంది.

అంతర అంటే...
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే వారి కోసం ఈ ఇంజిక్షన్‌ను రూపొందించారు. గతంలో ఉన్న కుటుంబ నియంత్రణ, యూఐడీ పద్ధతుల స్థానంలో ఈ నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా పెళ్లయిన వారితో పాటు, పిల్లల మధ్య ఎడం (ఎక్కువ సమయం తీసుకోవడం) కోరుకునే దంపతులకు అంతర ఇంజిక్షన్‌ను ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఇంజిక్షన్‌ తీసుకున్న మూడు నెలల వరకు గర్భం రాకుండా నిరోధించవచ్చు. ఈ తర్వాత కూడా పిల్లలు వద్దు అనుకుంటే మళ్లీ ఇంజిక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు కావాలని అనుకుంటే ఇంజిక్షన్‌ ఆపేసిన మూడు నెలల తర్వాత గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.

సులువైన, మేలైన పద్ధతి..
కొత్తగా పెళ్లయిన దంపతులు..  పిల్లల మధ్య ఎడం కావాల్సిన వారికి ఇది చాలా సులువైన, మేలైన తాత్కాలిక పద్ధతి. తాత్కాలిక కుటుంబ నియంత్రణ కోసం పాటించే పాత పద్ధతులతో చాలా సైడ్‌ ఎఫెక్ ఉండేవి. కుటుంబ నియంత్రణ పద్ధతులు కొన్నిసార్లు విఫలమై గర్భం దాల్చే అవకాశముండేది. మరికొన్ని పద్ధతులు పాటించడం ద్వారా ప్రాణాల మీదకు వచ్చేవి. ఇలాంటి వాటికి అవకాశం లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘అంతర’ ఇంజిక్షన్‌ను రూపొందించింది.

కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజిక్షన్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేశారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని వేదికగా తీసుకున్నారు. అంతర ఇంజిక్షన్‌ తీసుకునే మహిళలకు సంబంధిత ఆరోగ్య కేంద్రం సిబ్బంది హెల్త్‌కార్డు కేటాయిస్తారు. అందులో ఇంజిక్షన్‌ వివరాలు నమోదు చేస్తారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజిక్షన్‌ అందుబాటులో ఉంటుంది. రూ.1500 విలువైన ఈ ఇంజిక్షన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వేస్తారు.

పూర్తయిన శిక్షణ
అంతర ఇంజిక్షన్‌ వినియోగానికి సంబంధించి జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలకు, ఇతర సిబ్బందికి జిల్లాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ సమయంలో అంతర ఇంజిక్షన్‌కు సంబంధించి విధి విధానాలు, ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోజనాలను వివరించారు.

ప్రయోజనాలు ఇవే...

  • అంతర ఇంజిక్షన్‌ వినియోగంతో మూడు నెలల పాటు గర్భం దాల్చే అవకాశముండదు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇంజిక్షన్‌ మానేస్తే సరిపోతుంది.
  • పెళ్లయిన కొత్తలోనే గర్భం దాల్చడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి మాతా శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిరోధించడానికి ‘అంతర’ ఉపయోగపడుతుంది.
  • మహిళలు చిన్న వయస్సులోనే పిల్లలు కనడం వల్ల రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు ‘అంతర’ తోడ్పడుతుంది.
  • అనవసరమైన వైద్య చికిత్సలు, గర్భ నిరోధానికి వాడే పద్ధతుల వల్ల మహిళలకు ఇతర సైడ్‌ ఎఫెక్టŠస్‌ ఉండేవి. ఈ నూతన విధానం వల్ల ఇలాంటి వాటికి అవకాశముండదు.

అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచాం
మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘అంతర’ ఇంజిక్షన్లను అందుబాటులో ఉంచాం. ఉచితంగా ఈ ఇంజిక్షన్‌ను మెడికల్‌ ఆఫీసర్లు వేస్తారు. ఇప్పటికే మెడికల్‌ ఆఫీసర్లకు శిక్షణ కూడా పూర్తయ్యింది. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి విధానంలో ‘అంతర’ ఇంజిక్షన్‌ ఎంతో సురక్షితమైంది. ఇంజిక్షన్‌ వేసే ముందు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, మహిళ హెల్త్‌ కండీషన్‌ ఆధారంగానే వేస్తాం. 
- డాక్టర్‌ నీరజ, అంతర ప్రోగ్రాం జిల్లా అధికారి

మరిన్ని వార్తలు