ఫ్రీ జంక్షన్స్‌..ఫ్రీ టర్న్‌

16 Nov, 2017 11:00 IST|Sakshi
సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ జంక్షన్‌

ప్రధాన జంక్షన్లలో ఇక ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

100 జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ నిర్ణయం

తొలుత 34 ప్రాంతాల్లో విస్తరణ పనులు

అంచనా వ్యయం రూ.109 కోట్లు

టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.100 కోట్ల రుణం

పనులు పూర్తయితే ఇక సాఫీ ప్రయాణం

గోల్కొండ క్రాస్‌రోడ్డు నుంచి సచివాలయానికి వెళ్లేందుకు కిశోర్‌ వాహనంపై బయలుదేరగా యూటర్న్‌ చాలా దూరంలో కన్పించగా...రూట్‌ మార్చాడు. గాంధీనగర్‌ నుంచి వెళ్లి అశోక్‌నగర్, ఇందిరాపార్కు మీదుగా సచివాలయం వెళ్లాలనుకున్నాడు. కానీ అశోక్‌నగర్‌ జంక్షన్‌ దాటడానికి అతడికి 15 నిమిషాలు పట్టింది. ఇలా గమ్యం చేరేలోగా పలు జంక్షన్లలో ట్రాఫిక్‌ జామ్‌లతో దాదాపు 45 నిమిషాల సమయం వృథా అయింది.  
నగర జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్యల కారణంగా తలెత్తు్తతున్న ఇబ్బందులకు ఇదో ఉదాహరణ. ఇలాంటి వాటిని అధిగమించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సమస్యాత్మకంగా ఉన్న 100 జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత 34 జంక్షన్లలో విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఇందుకు రూ.109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యల కారణంగా వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు జంక్షన్ల విస్తరణ..అభివృదిపనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నగరవ్యాప్తంగా దాదాపు 250 జంక్షన్లుండగా, వాటిల్లో 100 చోట్ల అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. అర్బన్‌ జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌ (యూజేఐపీ)లో భాగంగా ఈ జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.  చాలా ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉండటంతో అందుకు  ఎంతో సమయం పట్టనుంది. దీంతో భూసేకరణ సమస్యలు లేని ప్రాంతాల్లో తొలిదశలో జంక్షన్ల అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమైంది. అలాంటి 34 జంక్షన్లను గుర్తించారు.

ఇప్పటి వరకు ఐదు ప్రాంతాల్లో మాత్రం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాలకు సంబంధించి అంచనాలు, అనుమతుల మంజూరు వంటి దశల్లో ఉన్నాయి. మలిదశలో భూసేకరణ సమస్యలు తక్కువగా ఉన్న 30 జంక్షన్లలో, మిగతావాటిని ఆతర్వాతి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలిదశలో చేపట్టనున్న పనులకు రూ.109 కోట్లు ఖర్చుకాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ పరిస్థితి దయనీయంగా ఉండటంతో రూ.100 కోట్లు తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ)నుంచి రుణంగా తీసుకోవాల్సిందిగా మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచించడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యారు. 

జంక్షన్ల అభివృద్ధి ఇలా..
ప్రధానంగా  జంక్షన్‌చుట్టూ వంద మీటర్లకు తగ్గకుండా రోడ్లను వెడల్పు చేస్తారు.
ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా నేరుగా వెళ్లే రోడ్డుతోపాటు కుడి, ఎడమవైపులకు వెళ్లే రోడ్లను కూడా విస్తరిస్తారు.
పాదచారులకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్స్‌ ఏర్పాటుచేసి, నిర్దేశిత ప్రాంతంలోనే రోడ్డు దాటే ఏర్పాటు చేస్తారు.
జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించేలా సైనేజీలతోపాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు.  
రెడ్‌సిగ్నల్‌ పడినప్పుడు పాదచారులు రోడ్డు దాటుతారు కాబట్టి, అప్పటి వరకు వారు వేచి ఉండేందుకు సదుపాయంగా తగిన ప్లాట్‌ఫామ్స్‌ కూడా నిర్మిస్తారు. 

తొలిదశలో అభివృద్ధిచేయనున్న జంక్షన్లు..
1.సుచిత్ర 2. ఐడీపీఎల్‌ 3.సిటీకాలేజ్‌ 4.అశోక్‌నగర్‌ 5.సైబర్‌సిటీ(ఖానామెట్‌) 6. ప్యారడైజ్‌ 7. హిమ్మత్‌పురా(శాలిబండ) 8.పురానాపూల్‌ 9.ఎన్‌ఎఫ్‌సీ 10.హైదర్‌గూడ(అత్తాపూర్‌) 11. కర్మన్‌ఘాట్‌ 12. బీఎన్‌ రెడ్డి 13. షెనాయ్‌ నర్సింగ్‌హోమ్‌ 14. ఐఐఐటీ 15. నిజాం కాలేజ్‌ 16. వీఎస్‌టీ 17. ఆజామాబాద్‌ 18. హస్తినాపురం 19. కవాడిగూడ 20. ఫీవర్‌ హాస్పిటల్‌ 21. రాణిగంజ్‌ 22. ఎతెబార్‌ చౌక్‌ 23. బీబీ బజార్‌ 24. అలీ కేఫ్‌ 25. బోరబండ బస్టాప్‌ 26. శివాజీ బ్రిడ్జి(దారుల్‌షాఫా) 27. మదీన 28. కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాప్‌ 29. రోడ్‌ నెంబర్‌ 6(అంబర్‌పేట) 30. బాలాజీనగర్‌ 31. రామంతాపూర్‌ చర్చి టి 32. నర్సాపూర్‌ 33. వీటీ కమాన్‌ 34. జోహ్రాబీ దర్గా.

నగరంలో మూడు రోడ్ల జంక్షన్ల నుంచి 12 మార్గాల నుంచి వచ్చి కలిసే జంక్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా....
నాలుగు కంటే ఎక్కువ రోడ్లు వచ్చి కలిసేవి
నాలుగు రోడ్ల జంక్షన్లు (చౌరస్తాలు)
మూడు రోడ్ల టీ జంక్షన్లు
మూడు రోడ్ల వై జంక్షన్లు
ఈ జంక్షన్లలో వాహనదారులు ముందుకు కదిలేందుకు ఎంతో సమయం పడుతోంది. వీటిల్లో కొన్నింటికి ఇటీవల సిగ్నళ్లు లేకుండా కొంత దూరం ముందుకు తీసుకెళ్లి యూటర్న్‌ ఇచ్చినప్పటికీ సమస్య తగ్గకపోగా కొన్ని చోట్ల మరింత తీవ్రంగా మారింది. తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ తదితర ప్రాంతాల్లో యూటర్న్‌ సిస్టం ఫెయిలైంది.

మరిన్ని వార్తలు