రాశి కాదు.. వాసి ముఖ్యం

15 Feb, 2016 00:45 IST|Sakshi
రాశి కాదు.. వాసి ముఖ్యం

నిరుద్యోగులు తల్లిదండ్రుల కలలు నేరవేర్చాలి
 రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

 
సిద్దిపేట జోన్ : గ్రూప్ టూ ఉచిత శిక్షణకు ఎంతమంది అభ్యర్థులు అర్హులయ్యారనేది ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చి ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారన్నదే ముఖ్యమని, రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లు  ప్రతి ఒక్కరూ నిర్ధేశిత లక్ష్యంతో రెండు నెలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఆదివారం మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు  ఉచితంగా ఇస్తున్న గ్రూప్2  శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేటలో కానిస్టేబుల్ పోస్టుల నియమకాల కోసం నిర్వహించిన పరీక్షను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. యువత నుంచి వచ్చిన స్పందనతో మరోసారి గ్రూప్2 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులను సొంతంగా నిర్వహిస్తున్నానన్నారు. ఉచితం అనగానే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఉంటుందని అది మంచిదికాదన్నారు.  ప్రముఖ కోచింగ్ సంస్థ డీజేఆర్‌కు శిక్షణ బాధ్యత అప్పగించి, తాను సొంతగా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించినప్పుడే తన అశయం నేరవేరుతుందన్నారు.  పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల ఆర్ధిక పరిస్థితి తనకు తెలుసని, వారిపై ఆర్ధిక భారం పడకుండా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రుల అశలను, కలలను నిజం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.
 
ఉచిత భోజన వసతి కల్పిస్తాం
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 350 మంది విద్యార్ధులు భవిష్యత్తులో  ఉద్యోగాలు సాధించినప్పుడే తన ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదవర్గాలకు నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు చేసే కృషిలో భాగంగానే 717 మందికి ఆర్హత పరీక్షలు నిర్వహించగా 350 ఆర్హత సాధించడం జరిగిందన్నారు. వీరందరికి రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. అదే విధంగా స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. అంతకు ముందు డీ జేఆర్ సంస్థ చీఫ్ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాలకే పరిమితమైన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  అంతకు ముందు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటామని మంత్రి హరీశ్‌రావు యువతీయువకులతో ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు