ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘భోజనం’

16 Dec, 2015 00:36 IST|Sakshi
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘భోజనం’

సర్కార్ యోచన: చక్రపాణి
విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు: హరగోపాల్

 
 షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నతవిద్య చదివేందుకు ఈ నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం  మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతలు సాయంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆచార్య హరగోపాల్‌తో కలసి ఆయన ప్రారంభించారు.  రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం హర్షణీయమని చక్రపాణి అన్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చాలామంది పేద బాలికలు పదో తరగతితోనే విద్యను ఆపివేయ డం బాధాకరమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉన్నత విద్య చదవాలని కోరారు. హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యను డబ్బుతో ముడిపెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నాణ్యమైనవిద్యను అందిస్తూ ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తలు