సూర్య దీపికకు అబర్న్‌ వర్సిటీలో ఎమ్మెస్‌ సీటు..

24 May, 2020 03:18 IST|Sakshi

ఉచితంగానే అడ్మిషన్, నెలకు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ అదనం

రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని ఘనత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ కోర్సులో సీటు దక్కింది. హైదరాబాద్‌ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. ఇంకా ఫైనల్‌ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఫారెస్ట్రీ కోర్సులో దీపిక కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ యూనివర్సిటీ ఎమ్మెస్‌లో సీటును పూర్తి ఉచితంగా ఇచ్చింది.

రెండేళ్ల ఈ ఎమ్మెస్‌ కోర్సు ఫీజు 15,000 డాలర్లు కాగా దీనిని మాఫీ చేయటంతో పాటు నెలకు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా మంజూరు చేసింది (ఈ రెండింటి విలువ దాదాపు రూ. 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా). అబర్న్‌ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్‌ జన్నా విల్లోగ్‌ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్‌ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించడంలో భాగంగా ఎఫ్‌సీఆర్‌ఐ గతంలో అబర్న్‌ తోపాటు కెనడాకు చెందిన బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరో ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కే అవకాశం ఉందని కాలేజీ డీన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు.

ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక 
తన అకడమిక్‌ కోర్సులో భాగంగా ఉన్నతవిద్యను అభ్యసిస్తానని, అందులోనూ అమెరికాలో ఎమ్మెస్‌ చదువుతానని తాను ఊహించలేదని సూర్య దీపిక తెలిపింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అటవీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది తనకు అన్నివిధాలా అండగా నిలిచారని పేర్కొంది. నగర శివార్లలోని ములుగులో నెలకొల్పిన ఎఫ్‌సీఆర్‌ఐలో ప్రస్తుతం బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు నడుస్తోంది. 2016కు చెందిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులు ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది ఉన్నత చదువులతో పాటు, సివిల్‌ సర్వీసులకు కూడా ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు వచ్చినట్లు డీన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు