లాక్‌ డౌన్‌లో చౌక

2 Apr, 2020 07:38 IST|Sakshi

రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ షురూ  

సర్కిల్‌కు 6 నుంచి 8 షాపుల చొప్పున ఎంపిక

ఒక్కో చోట వందకు తగ్గకుండా టోకెన్ల జారీ

మూడోరోజు నుంచి అన్ని రేషన్‌ షాపుల్లోనూ..  

బారులు తీరిన వైనం

సామాజిక దూరం పాటించని లబ్ధిదారులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ గందరగోళానికి దారితీస్తోంది. కొన్ని చోట్ల సామాజిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం ప్రయోగాత్మకంగా పరిమిత రేషన్‌ షాపుల ద్వారా టోకెన్‌ విధానంపై బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. పౌర సరఫరాల శాఖ ఎంపిక చేసిన షాపులు, పంపిణీ పద్ధతులపై విస్తృత ప్రచారం చేయకపోవడంతో అవగాహన లేక ఆహార భద్రత కార్డుదారులు  రేషన్‌షాపులకు భారీగా తరలివచ్చారు. టోకెన్ల కోసం ఎగబడటంతో కొంత గందరగోళం ఏర్పడింది. తెరవని దుకాణాల వద్ద బారులుతీరారు. దుకాణాలు తెరవక పోవడంతో నిరాశతో వెనక్కి  తిరిగారు.

వాస్తవంగా ఆహార భద్రత కార్డులోని ప్రతిలబ్ధిదారుడికీ 12 కిలోల చొప్పున ఉచితంగాఅందిస్తుండటంతో బియ్యం కోసం పేదలు ఉరుకులు పరుగులు తీశారు. ఉచిత బియ్యం పంపిణీలో షాపుల వద్ద కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో షాపుల ముందు డబ్బాలు గీసి లబ్ధిదారులు సామాజిక దూరం పాటించే విధంగాచర్యలు చేపట్టారు.  నగరంలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ప్రయోగాత్మకంగా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఖైరతాబాద్‌లోని రేషన్‌ షాపు నంబర్‌ 702లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి  శ్రీనివాస్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.  నగరంలోని ఒక్కో సర్కిల్‌ పరిధిలో ప్రయోగాత్మకంగా ఆరు నుంచి 8 రేషన్‌ షాపులు ఎంపిక చేసి మొదటి రోజు వంద టోకెన్లకు తగ్గకుండా ఇచ్చి బియ్యం పంపిణీ చేశారు. కొన్ని షాపులద్వారా 150పైగా లావాదేవీల జరిగాయి. మొత్తమ్మీద తొలిరోజు 67 షాపుల ద్వారా 7,584 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.

రెండో రోజు కూడా వందకు తగ్గకుండా టోకెన్లు మాత్రమే పంపిణీ చేయనున్నారు. మూడోరోజు మొత్తం 675 షాపులకు బియ్యం పంపిణి కార్యక్రమాన్ని విస్తరిస్తామని డీఎస్‌ఓ పద్మజా తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్ధలో ఈ–పాస్‌ అమలవుతున్న కరోనా నేపధ్యంలో  బయోమెట్రిక్‌ యంత్రంపై వెలిముద్ర లేకుండానే  కేవలం రేషన్‌ కార్డు, కార్డు నంబర్‌ ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులైన కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు కార్డు తెచ్చిన ఉచిత బియ్యం అందించారు. వరుసగా రెండు, మూడు నెలలు రేషన్‌ తీసుకోని కార్డుదారులకు మాత్రం బయో మెట్రిక్‌పై వేలిముద్ర ఆధారంగా పంపిణీ చేశారు.  
నగర శివారు ప్రాంతాల్లో సైతం రేషన్‌ పంపిణీ ప్రారంభమైంది. మేడ్చల్‌– మల్కాజిగిరిæ జిల్లాలో సుమారు 636 షాపులుండగా.. బుధవారం 121 షాపుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తొలి రోజు 9946 కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించారు.

మరిన్ని వార్తలు