మరో 3 నెలలు ఉచిత బియ్యం?

30 Jun, 2020 06:04 IST|Sakshi

రాష్ట్రాల నుంచి డిమాండ్‌.. పరిశీలిస్తున్న కేంద్రం 

రూ. 46 వేల కోట్ల మేర భారం పడుతుందని అంచనా 

సీఎం నిర్ణయం మేరకు కేంద్రాన్ని కోరనున్న తెలంగాణ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు మరో మూడు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో పంపిణీ చేసినట్టే మరో మూడు నెలలు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్రాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయగా, తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి రేషన్‌కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉచిత బియ్యం పంపిణీ జూన్‌తో ముగియనుంది. జూలై నుంచి పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే దు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసినా, పేదలకు సరైన ఉపాధి, ఆదాయ మార్గాలు లేవు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో అస్సోం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పంజాబ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు.. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీని మరో మూడు నెలలు పొడిగించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. ‘రాష్ట్రాల వినతిపై ప్రధానికి లేఖ రాశా. మరో మూడు నెలలు పంపిణీ చేయాలంటే కేంద్రంపై రూ.46 వేల కోట్ల భారం పడుతుంది. తుది నిర్ణయం రావాల్సి ఉంది’అని కేంద్ర మంత్రి పాశ్వాన్‌ ఆదివారం ఢిల్లీలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  

సీఎంతో చర్చించాక నిర్ణయం.. 
ఉచిత బియ్యం విషయమై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి వినతీ చేయలేదు. రాష్ట్రంలో 2.80 కోట్ల మంది లబ్ధిదారులకుగానూ కేంద్రం 1.91 కోట్ల మందికి మాత్రమే బియ్యం ఇస్తుండటంతో మిగతా భారం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి, ఆయన సూచన మేరకే కేంద్రానికి లేఖ రాయాలా, వద్దా? అనేది నిర్ణయిస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు