వైఫై వర్రీ!

3 Apr, 2018 08:39 IST|Sakshi

గ్రేటర్‌లో ఉచితవైఫై సేవలు అంతంతే

మొత్తం 86 హాట్‌స్పాట్స్‌లో16 మినహా మిగతా చోట్ల సిగ్నల్‌ వీక్‌...

నిరాశ వ్యక్తం చేస్తున్నవినియోగదారులు

పర్యాటక స్థలాల్లోనే డేటావినియోగం అధికం

‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి

గ్రేటర్‌లో ఉచిత వైఫై సేవలు అలంకారప్రాయంగా మారాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌– క్వాడ్‌జెన్‌ సంస్థలు సంయుక్తంగా మహానగరంలో 86 చోట్ల ఏర్పాటు చేసిన ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో 16 మినహా ఎక్కడా తొలి 15 నిమిషాలు ఉచిత డేటా వినియోగం(యాక్సెస్‌) అమలు కావడం లేదు. దాదాపు 70  హాట్‌స్పాట్స్‌ వద్ద ఉచిత వైఫై సేవలు అందడం లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. మార్చి నెలలో వై–ఫై హాట్‌స్పాట్స్‌ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 జీబీ డేటా వినియోగించుకున్నట్లు వెల్లడైంది.

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికి మాత్రం నిరంతరాయంగా వై–ఫై సేవలు అందుబాటులోకి వస్తుండడం గమనార్హం. ఇక ఉచిత వై–ఫై వినియోగంలో నగరంలోని చారిత్రక, దర్శనీయ స్థలాలు అగ్రభాగాన నిలిచాయి. ప్రధానంగా చార్మినార్, ట్యాంక్‌బండ్, జూపార్క్, గోల్కొండ ఫోర్ట్, సాలార్జంగ్‌ మ్యూజియంలు తొలి ఐదు స్థానాలు దక్కించుకోవడం విశేషం.

సిగ్నల్‌ వీక్‌..ఉచితం అంతంతే..
గ్రేటర్‌ పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌–క్వాడ్‌జెన్‌ సంస్థలు సంయుక్తంగా 86 చోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏడాది క్రితం ఏర్పాటుచేశాయి. వీటి వద్ద ఏకకాలంలో 300 మంది డేటాను వినియోగించుకునేందుకు వీలుగా 194 యాక్సెస్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు. తొలుత 15 నిమిషాలు ఉచితంగా అందుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 16 చోట్ల మినహా దాదాపు 70  హాట్‌స్పాట్స్‌ వద్ద ఈ పరిస్థితి లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్‌ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై–ఫై సేవలకు వీక్‌సిగ్నల్‌ ప్రతిబంధకంగా మారింది. ఆన్‌లైన్‌లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికే సేవలు అందుతుండడం గమనార్హం. మార్చి నెలలో మొత్తం 86 వై–ఫై హాట్‌స్పాట్స్‌ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 గిగాబైట్ల డేటా వినియోగించుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 

వై–ఫై వినియోగంలో సమస్యలివీ..
ఉచిత ౖÐð ఫైఫై సేవల వినియోగం విషయంలో పలు మార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాదిమంది వినియోగదారులు వైఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తే వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్‌ తగ్గుతోందని,ఒక్కోసారి వై.ఫై కనెక్ట్‌కావడం లేదని నక్లెస్‌రోడ్‌పై వైఫై సేవలు వినియోగిస్తున్న పలువురు వినియోగదారులు ‘సాక్షి’కి తెలిపారు.  విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు పొందడం వీలుపడడంలేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్‌ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు.

విస్తరణ ఆలస్యమేనా..?
గ్రేటర్‌ పరిధిలో మరో 240 ప్రాంతాల్లో వై–ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటుచేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. కానీ వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మూడునెలలుగా అనుమతులు ఆలస్యమౌతుండడం,హాట్‌స్పాట్‌ల ఏర్పాటు,వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్‌ కనెక్షన్,రోడ్‌కటింగ్‌ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమౌతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరమైన సహకారం అందితే మరో మూడునెలల్లోగా అనుకున్న ప్రకారం మరో 240  హాట్‌స్పాట్‌ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ చెబుతోంది. ఒక్కోచోట హాట్‌స్పాట్‌ ఏర్పాటుకు సుమారు లక్ష రూపాయలు అవసరమౌతాయని పేర్కొంది.నగరంలో తమ సంస్థకు 4500 కి.మీ మేర ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉందని ప్రకటించింది.

వినోదం, సినిమాలకే అధికప్రాధాన్యం..
ఇక వైఫై వినియోగానికి వస్తే చాలామంది వినియోగదారులు సినిమాలు,పాటలు వీక్షించేందుకు యూట్యూబ్‌ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట..మరికొంతమంది వివిధ బస్సు,రైళ్ల వేళలు,రిజర్వేషన్ల వివరాలను తెలుసుకుంటున్నారట.

ఇలా వినియోగించుకోవాలి...
మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్‌నెంబరును,ఈమెయిల్‌ అడ్రస్‌ టైప్‌చేసి సబ్‌మిట్‌చేయాలి.
ఆతరవాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్,పాస్‌వర్డ్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందుతాయి.
రెండో బాక్సులో యూజర్‌నేమ్,పాస్‌వర్డ్‌ టైప్‌చేసి లాగిన్‌ కావాలి. అపుడు 15  నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందుతాయి.  
ఆతరవాత వైఫై సేవలను వినియోగిచేందుకు ప్రతి అరగంటకు రూ.30 ఛార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. లేదా హాట్‌స్పాట్‌లున్నచోట బీఎస్‌ఎన్‌ఎల్‌ కూపన్లను కొనుగోలు చేయవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌  హాట్‌స్పాట్స్‌ ఏర్పాటుచేసిన ప్రాంతాలు కొన్ని..            
సంజీవయ్యపార్క్,బిర్లామందిర్, బిర్లాప్లా నిటోరియం,బిర్లా సైన్స్‌ మ్యూజియం,నిమ్స్,పబ్లిక్‌గార్డెన్,చార్మినార్,గాంధీఆస్పత్రి,తారామతిబారాదరి,ప్లాజాహోటల్,సరూర్‌నగర్,ప్యాట్నీ,సీఎస్సీ తార్నాక,సీఎస్‌సీ గౌలీగూడా,కెపిహెచ్‌బి,లింగంపల్లి,జూబ్లీహిల్స్,కుషాయిగూడా,నాంపల్లి,అమీర్‌పేట్,మాదాపూర్,టోలిచౌకి,మేడ్చల్,పంజాగుట్ట,బీఎస్‌ఎన్‌ఎల్‌భవన్,సీటీఓ,ఎర్రగడ్డ,ఆబిడ్స్,తిరుమలగిరి,కొంపల్లి,ముషీరాబాద్,
సాలార్జంగ్‌ మ్యూజియం, జూపార్క్, గోల్కొండఫోర్ట్, ప్రెస్‌క్లబ్,నానక్‌రాంగూడ.

మరిన్ని వార్తలు