స్వేచ్ఛ, అధికారమే ఎజెండా

10 Mar, 2018 02:21 IST|Sakshi

రాష్ట్రాలకు సాధికారత కావాలి.. సీనియర్‌ అధికారులు, నిపుణులతో కేసీఆర్‌

న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో మార్పులు రావాలి

సంస్కరణలు తేవాలి.. చట్టాలను మార్చాలి

కేంద్ర, రాష్ట్రాల మధ్య అంశాల విభజన పూర్తిగా జరగాలి

రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలి

అన్ని వర్గాలకు ప్రయోజనకరమైన దేశాభివృద్ధి ఎజెండా కావాలి

ఆ దిశగా తగిన మార్గనిర్దేశనం చేయాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలని.. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో మార్పులు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండాను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు.. ఇలా అన్ని విషయాల్లో స్పష్టమైన ఎజెండా రూపొందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్ధతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి.. అవసరమైన మార్పులు తెచ్చే విషయంపై వివిధ రంగాల నిపుణులు, సీనియర్‌ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాలకు చెందిన వారు ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించడంతోపాటు, ప్రస్తుత విధానాల్లో మంచి చెడులపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, క్రియ స్వచ్ఛంద సంస్థ సీఈవో బాలాజీ ఊట్ల, పలువురు రిటైర్డ్‌ అధికారులు, సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఇన్నేళ్లయినా సమస్యలే.. 
అనుకున్న పురోగతి రావడం లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతి పథంలో దూసుకెళుతున్నా.. మన దేశంలో ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు తీరకుండా ఉన్నారు. చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దేశ ప్రజలందరికీ మంచినీరు అందడం లేదు. విద్యుత్‌ అందడం లేదు. సాగునీటి సౌకర్యం లేదు. ఇంకా చాలా అవసరాలు తీరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావడం లేదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలోనూ అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదు. ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించాల్సిన అవసరముంది..’’అని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించిందని.. ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో పాటు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. 

ఉమ్మడి జాబితాతో సమస్యలు.. 
దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య.. ఏయే శాఖలు ఎవరి వద్ద ఉండాలనేది నిర్ణయం జరగాలని కేసీఆర్‌ చెప్పారు. ఉమ్మడి జాబితా అమల్లో ఉండడం వల్ల ఒకేశాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని.. దానివల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. దానిని పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి ఉందని... ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలని స్పష్టం చేశారు. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలలో మార్పులు రావాలన్నారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు తదితర అంశాల్లో స్పష్టమైన ఎజెండా రూపొందాలని చెప్పారు. దేశంలోని అధికారులు, రాజకీయ నాయకులు, రిటైర్డ్‌ అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సూచనలు ఇవ్వాలని.. తమ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు