మానవత్వానికి బహిష్కరణ!

1 Sep, 2017 08:29 IST|Sakshi

సూర్యాపేట జిల్లా చిలుకూరులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం వెలి

చిలుకూరు (కోదాడ): ఆమె ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్య.. స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లవాళ్లపై పోరాడిన భర్తకు తోడునీడగా నిలిచింది.. కానీ తన జీవిత చరమాంకంలో కుల చిచ్చులో చిక్కుకుపోయింది.. కుల బహిష్కరణకు గురికావడంతో సన్నిహితులకు, తెలిసినవాళ్లకు దూరమైంది.. ఆమె మరణించాక దహన సంస్కారాలకు కూడా కులం వాళ్లెవరూ రాకపోవడంతో ఆలస్యంగా గురువారం ఈ విషయం వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఈ ఘటన జరిగింది. ఆగ్రహం పెంచుకుని..: చిలుకూరు గ్రామానికి చెందిన చిలువేరు గురవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన భార్య నర్సమ్మ. చాలాకాలంగా గ్రామంలో తమ కుల పెద్దగా వ్యవహరించిన గురవయ్య కొన్నేళ్ల కింద చనిపోయారు. తర్వాత ఆయన కుమారుడు రామలింగయ్య కులపెద్దగా వ్యవహరించారు. గ్రామంలో ఆ కులానికి చెందిన కుటుంబాలు 60 వరకు ఉన్నాయి. అయితే ఆరు నెలల కింద అదే కులానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి.. కొంతమంది కులస్తులతో కలసి తానే కులపెద్దగా ప్రకటిం చుకున్నాడు.

 ఆయన సాక్షర భారత్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తుండడం, ప్రభుత్వ పథకాల విషయంలో కార్యాలయాల చుట్టూ తిరుగుతుం డడంతో ఆ కులం వాళ్లు అతడివైపే మొగ్గుచూపారు. కానీ గ్రామంలో మిగతా కులాల పెద్దలు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఆంజనేయులు ఆగ్రహం పెంచు కుని.. చిలువేరు రామలింగయ్యను, నర్సమ్మను కులం నుంచి బహిష్కరించాడు. కులానికి చెందిన ఎవరైనా వారి ఇంటికి వెళ్లినా, ఎలాంటి కార్యక్రమాలకు హాజరైనా జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇటీవల ఆ కులానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో శుభాకార్యానికి చిలువేరు రామలింగయ్య కుటుంబాన్ని ఆహ్వానించాడు. దీనిపై ఆగ్రహించిన ఆంజనేయులు కుల పంచాయితీ పెట్టి.. ఆ వ్యక్తిని హెచ్చరించి, రూ.వెయ్యి జరిమానా విధించాడు. దీంతో కులం వాళ్లంతా భయపడి చిలువేరు రామలింగయ్య కుటుంబానికి దూరంగా ఉన్నారు.

నర్సమ్మ మృతితో..: రామలింగయ్య తల్లి నర్సమ్మ (102) గురువారం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు కూడా కులం వాళ్లు ఎవరూ వెళ్లవద్దంటూ ఆంజనేయులు ఆదేశించడంతో.. 60 కుటుంబాలలో ఒక్కరు కూడా రాలేదు. దీనిపై గ్రామపెద్దలు ఆంజనేయులుతో మాట్లాడినా.. ‘ఆ కుటుంబాన్ని బహిష్కరించాం.. అక్కడికి వచ్చేది లేద’ని స్పష్టం చేశాడు. కుటుంబ సభ్యులు చివరికి బంధువులు, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

చర్యలు తీసుకోవాలి
ఆంజనేయులు మా కుటుంబాన్ని బహిష్కరించాడు. అతను సాక్షర భారత్‌ కో–ఆర్డినేటర్‌గా, ప్రభుత్వ పథకాల పనుల్లో కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో కులంలో అందరూ అతడి మాట వింటున్నారు. సాక్షర భారత్‌ కో–ఆర్డినేటర్‌గా కుల బహిష్క రణను అరికట్టాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతు న్నాడు. అతడిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– చిలువేరు వెంకటేశ్వర్లు, రామలింగయ్య కుమారుడు

మరిన్ని వార్తలు