ఫ్రీడం స్కూల్‌ విధానానికి గురుకుల సొసైటీ శ్రీకారం

5 Dec, 2019 08:37 IST|Sakshi

సాక్షి, జమ్మికుంట(కరీంనగర్‌): సంప్రదాయ బోధనా పద్ధతులకు భిన్నంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ, వారిలో బోధన, గ్రహణ, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ స్వేచ్ఛా పాఠశాలల (ఫ్రీడం స్కూళ్లు) విధానం తీసుకువచ్చింది. స్వేచ్ఛా పాఠశాలల్లో పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకు నడుస్తోంది. దీంతో ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

ప్రార్థనతో సేచ్ఛ ప్రారంభం
ఉదయం ప్రార్థనతో విద్యార్థులకు సేచ్ఛ ప్రారంభం అవుతుంది. మాడ్యూల్స్‌లోని అంశాలపై విద్యార్థులు పరస్పరం వేర్వేరుగా, బృందాలుగా చర్చలు జరుపుకోవడంతోపాటు లోతుగా పరిశీలించడం చేస్తుంటారు. సాధారణ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలు ఈ పాఠశాలల్లో కానరావు. పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతో విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. 

పాఠాల బోధనకు స్వస్తి
స్వేచ్ఛా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధించరు. సలహాదారులుగా మాత్రమే ఉంటారు. తరగతిగదుల్లో చదువుకోవాలనే నిబంధనలేమీ ఉండవు. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయం ఉండదు. విద్యార్థుల ప్రతిభను బట్టి మార్కులు వేస్తుంటారు. ఈ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు భయం ఉండదు. ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంతా విద్యార్థుల ఇష్టం. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆప్యాయత పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు కరచాలనం, ఆలింగనం చేసుకుంటారు. దీంతో పిల్లల్లో భయం పోయి ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉంటారు.

23 గురుకుల పాఠశాలల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం సేచ్ఛా పాఠశాలల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపరిచేందుకు సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

అన్ని గురుకులాల్లో ఏర్పాటు చేయాలి
ఫ్రీడం స్కూల్‌ విధానాన్ని దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో అమలు చేయాలి. గురుకులంలో చదువుతున్న విద్యార్థిని 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ, బెంగుళూరులో పేరుగాంచిన యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫ్రీడం స్కూల్‌ విధానం అమలులోకి వస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.                                 
– అంబాల ప్రభాకర్, తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌(టీజీపీఏ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, జమ్మికుంట

పరిజ్ఞానం పెరుగుతుంది
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకులాల్లో స్వేచ్ఛా పాఠశాలల విధానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో పరి జ్ఞానం పెరుగుతుంది. బోధన, అభ్యసన తదితర కార్యక్రమాలన్నీ విద్యార్థులే చూసుకోవడం వల్ల ప్రతీ అంశంపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇది భయాన్ని పోగొట్టే కార్యక్రమం.
– పల్లె సురేందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీపీఏ, చింతకుంట

కొత్త విషయాలు తెలుస్తాయి
ఫ్రీడం స్కూల్‌ విధానంలో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్తకొత్త పద్ధతులు అలవాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి లేని బోధన, అభ్యసన సాగాలనే ఉద్దేశంతో అమలు చేసిన స్వేచ్ఛా పాఠశాలల విధానాన్ని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. 
– గుడిసె అనిత, ముస్తాబాద్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా