ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కావాలి

22 Jun, 2015 00:33 IST|Sakshi
భోపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్

* భోపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధ
* ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని భోపాల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో ఆంగ్ల భాషతోపాటు మాతృభాషలో కూడా బోధన ఉండాలని అన్నారు.

తెలంగాణ ఉద్యమ రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన నాల్గో స్మారకోపన్యాసంలో కార్పొరేటీకరణ-ప్రకృతి వనరులు-విద్య అనే అంశంపై ఆయన ప్రసంగించారు. విద్యా హక్కు అందరికి ఉండాలని, విద్యాబోధన పద్ధతులు మారాలని ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ అన్నారు. అంబేడ్కర్ స్పూర్తితో జయశంకర్ పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ రూపకర్తగా నిలిచారని కొనియాడారు.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రజలను చైతన్యం చేయటంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ముందుండాలన్నారు. రాష్ట్ర నవ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ విద్యారంగ నిర్మాణంలో మార్పులు అవసరమన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.  తెలంగాణ కోసం పరితపించిన జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు.

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ  ప్రజల త్యాగాలను కొందరు భోగాలుగా అనుభవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వి.శివలింగ ప్రసాద్, విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్యయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు