శవాల రోదన...!

5 Jul, 2014 05:15 IST|Sakshi

ఖమ్మం సిటీ:  జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో అనాథ శవాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సంబంధీకులు వచ్చినా కూడా గుర్తించలేనంతగా తయారవుతున్నాయి. ‘రోగికి మందులేయటమే ఇక్కడ గగనం. శవాలను కూడా ఏం పట్టించుకునేది...’ అన్నట్టుగా ఈ ఆస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ దయనీయంగా తయారైంది. అనాధ శవాలను భద్రపరిచేందుకు ఆరేళ్ల క్రితం  రెండు ఫ్రీజర్లు ఈ ఆస్పత్రికి మంజూరయ్యాయి.

 ఇవి కొంతకాలం కింద మూలనపడ్డాయి. నిపుణులు మరమ్మతు పనిచేసిన తరువాత వారం పది రోజులపాటు బాగానే పనిచేసి, ఆ తరువాత మూలనపడేవి. ఇవి ఇలా తరచూ  మొరాయిస్తుండడంతో ఆస్పత్రి అధికారులు కూడా మరమ్మతు చేయించకుండా పక్కన పడేశారు. దీంతో, మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పక్కకు పడేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దుర్గంధం భరించలేక మిగతా శవాలకు కూడా వైద్యులు పోస్టుమార్టం
నిర్వహించలేకపోతున్నారు.

విధి నిర్వహణలో భాగంగా మార్చురీకి వచ్చిన ఓ కానిస్టేబుల్.. పురుగులు పట్టి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని చూసి వాంతులు చేసుకుచేసుకున్నాడు. దీనినిబట్టి ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చు. రైలు కిందపడి మృతిచెందిన వారి దేహాలను ఆచూకీ కోసం మార్చురీలో మూడు, నాలుగు రోజులపాటు ఉంచుతారు. కానీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వీటిని ఒక్క రోజు కూడా ఉంచడం లేదు. వారి సంబంధీకులు ఆ తరువాత వచ్చినప్పటికీ.. కడసారి చూపు దక్కడం లేదు.

 కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపించాం...
 కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య చెప్పారు. ఇప్పుడున్న ఫ్రీజర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని అన్నారు. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో కొత్త ఫ్రీజర్లు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో కూడా మాట్లాడామని అన్నారు.ప్రస్తుతం ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం వాస్తవమేనన్నారు.

మరిన్ని వార్తలు