‘షా’న్‌దార్‌ టూంబ్స్‌

23 Aug, 2019 12:12 IST|Sakshi
ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్‌షాహీల సమాధులు

సెవెన్‌ టూంబ్స్‌కు ఫ్రెష్‌ లుక్‌

కుతుబ్‌షాహీల సమాధుల పునరుద్ధరణ

నగర పర్యాటకంలో మరో అద్భుతం

రూ.100 కోట్లతో ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభం

ఇప్పటికి 65 శాతం పనులు పూర్తి

సాక్షి,సిటీబ్యూరో: నగర పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవాబుల చారిత్రక వైభవానికి ప్రతీకలైన ‘సెవెన్‌ టూంబ్స్‌’ మెరవనున్నాయి. గోల్కొండ ఖిల్లా సమీపానఇబ్రహీంబాగ్‌లో ఉన్న కుతుబ్‌ షాహీల సమాధులకు మెరుగులు దిద్దనున్నారు. గోల్కొండ కేంద్రంగా దక్కన్‌ రాజ్యాన్ని 175 ఏళ్లు ఏలిన కుతుబ్‌షాహీల్లోనిఏడుగురు నవాబుల   సమాధులను(సెవెన్‌ టూంబ్స్‌) ఇండో పర్షియన్‌ శైలిలో నిర్మించారు. ఇప్పుడు వీటిని పునరుద్ధరించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందుకు ఆగాఖాన్, టాటా ట్రస్ట్‌లు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. సుమారు రూ.100 కోట్లతో ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయి. బెంగాల్‌ వాస్తు, నిర్మాణ నిపుణులు ఈ సమాధులకు డంగుసున్నంతో సొబగులు అద్ది పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.  

వడివడిగా ఆధునికీకరణ
గోల్కొండ రాజ్యాన్ని పాలించిన ఎనిమిది మంది పాలకుల్లో ఏడుగురితో పాటు మరో డెబ్బై మంది రాజవంశీకులను మరణానంతరం ఇబ్రహీంబాగ్‌లోనే సమాధి చేశారు. చివరి రాజు తానీషా.. ఔరంగజేబు చేతుల్లో బందీగా వెళ్లడంతో ఆయన సమాధి ఇక్కడ లేకుండాపోయింది. అయితే, కుతుబ్‌షాహీ కాలంలో గొప్పగా ఆరాధించబడిన సమాధులను 19వ శతాబ్దంలో మూడో సాలార్‌జంగ్‌ ఆధ్వర్యంలో ఆధునికీకరించి, చుట్టూ ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. అద్భుతమైన నిర్మాణ శైలితో ఉన్న సమాధుల గోపురాలు, ఆర్చిలు, రాతి కట్టడాలు, షాండ్లియర్లు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఇప్పటికే సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా, హయత్‌ బక్షీ బేగం సమాధుల సుందరీకరణ పూర్తయింది. నవాబులు, వారి కుటుంబాల మృతదేహాల ఖననానికి ముందు బంజారా దర్వాజా నుంచి బయటకు తీసుకువచ్చి స్నానం చేయించే ప్రాంగణం సైతం అత్యంత సుందరంగా, ఆనాటి సహజత్వానికి ఏమాత్రం తేడా లేకుండా కళాకారులు రేయింబవళ్లు నగిషీలు చెక్కుతున్నారు. ఇందులో అతిపెద్ద నిర్మాణమైన సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా సమాధికి అనేక ప్రత్యేక ఆకర్షణలను మళ్లీ పునరుద్ధరిస్తున్నారు.

యునెస్కో ప్రతిపాదన వాయిదాతొలుత కుతుబ్‌ షాహీ సమాధులను యునెస్కో బృందానికి చూపించి ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో చోటు దక్కేలా చేయాలని ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ప్రయత్నించింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో యునెస్కో ప్రతిపాదనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులో యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. అయితే, నిర్మాణాల పునరుద్ధరణ పనులు ఇంకా మిగిలి ఉండడంతో ఈ కట్టడాలను బృందం చూసే అవకాశం లేదని ఇంటాక్‌ అధ్యక్షురాలు అనురాధారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. మొత్తం సెవెన్‌ టూంబ్స్‌ను పునరుద్ధరణ పూర్తయితే ప్రపంచ పర్యాటక రంగంలో దక్కన్‌ నిర్మాణశైలి అందరినీ అశ్చర్యపరచడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు