ఉర్దూ తెలియక... ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు దెబ్బ..!

29 Jun, 2018 20:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫెండ్లీ పోలీసింగ్‌ విధానం రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుండగా.. ముస్లిం నివాస ప్రాంతాల్లో మాత్రం అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ముస్లింల ప్రాబల్యం అధికంగా గల పాతబస్తీ, చార్మినార్‌ వంటి ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ఉర్దూ భాష తెలియక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా, భాషా రాహిత్యం వల్ల వారు ముస్లిం వర్గాలతో మాట్లాడే సందర్భంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లక్ష్యం దెబ్బతింటోంద’ని అడ్వకేట్‌ సమీయుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు.. తెలుగులో ‘మీరు’ అనే మర్యాదపూర్వక పిలుపుకు ఉర్దూలో ‘ఆప్‌’అనే పదం ఉంది. కానీ, దానికి బదులు ‘తు’ అనే పదాన్ని ప్రయోగించినప్పుడు ఎదుటివారి మర్యాద తగ్గించి మాట్లాడిన వారమవుతామని ఆయన అన్నారు.

క్రిమినల్స్‌తో దురుసుగా మట్లాడితే ఫరవాలేదుగానీ, చిన్న చిన్న ఫిర్యాదుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్కువ చేసే వ్యాఖ్యలు పొరపాటున వ్యక్తమయినా ప్రజలకు పోలీసులపై చెడు అభిప్రాయం కలుగుతుందని మరో అడ్వకేట్‌ మహ్మద్‌ రషీద్‌  అన్నారు. అయితే, భారత పోలీసు సేవల చట్టం ప్రకారం.. ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారో ఆయా ప్రాంతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన పెద్దగా అమల్లోలేదు. దాంతో, గొడవలు, అల్లర్లు జరిగినప్పుడు ఆదేశాలు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. కాగా, ఉర్దూ తదితర భాషల్లో పట్టుసాధించడానికి పోలీసులకు స్వల్పకాలిక కోర్సులు ప్రవేశపెట్టనున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు