పాండు ఆశయం.. ఫలించిన వేళ 

6 Sep, 2019 11:12 IST|Sakshi

డోకూర్‌లో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు

స్నేహితుడి కోరికను నెరవేర్చిన మిత్రబృందం

సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్‌): తమ స్నేహితుడి కోరికను తోటి మిత్రులు నెరవేర్చారు. దీంతో మృతిచెందిన ఆ యువకుడి ఆశయం నెరవేరింది. మండలంలోని డోకూర్‌లో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వాకిటి గోవిందు, తిరుపతమ్మ దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు పాండు(22) ఒక్కగానొక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు ఆశలన్ని కొడుకుపైనే పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుతూ చదివించారు.

పాండు ఐటీఐ పూర్తిచేశాడు. అయితే అప్పుచేసి ఓ ఇల్లు కట్టుకున్నారు. పొలాలు కూడా అంతగా లేకపోవడంతో ఆ కుటుంబానికి కుటుంబ పోషణ భారమైంది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబం సతమతమైంది. ఇది పాండును బాగా ప్రభావితం చేసింది. తల్లిదండ్రులకు అండగా ఉండటానికి చేసిన అప్పులు ఎలాగైన తీర్చాలన్న ఉద్దేశంతో బతుకుదెరువు కోసం ఏదైన ఉద్యోగం చేయాలని గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం కోసం వెతుకుతూ కూలీ పనికి వెళ్లాడు. అయితే అదే నెల 17న అక్కడ ఓ బిల్డింగ్‌పై కూలి పనిచేస్తూ 4 అంతస్తుల భవనం నుంచి కిందపడి మృతిచెందాడు. 

చందాలు వేసుకొని..
డోకూర్‌ పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేయాలని పాండు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులతో తరచూ చెబుతుండేవాడు. ఇలాంటి మంచిపని చేయాలని పట్టుదలతో ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ కోరిక నెరవేరక ముందే పాండు మృతిచెందాడు. దీంతో తన స్నేహితుడు పాండు కోరిక మేరకు పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులంతా చందాలు వసూలు చేసి పాఠశాలలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేశారు. 

ఘన సన్మానం..
డోకూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరస్వతీ విగ్రహాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి బీజేపీ నాయకుడు డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యజ్ఞభూపాల్‌రెడ్డి, సర్పంచ్‌ రామకృష్ణారెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం నాగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేసి స్నేహితుడి ఆశయాన్ని నెరవేర్చిన మిత్రులు, రాక్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు శేఖర్, సురేష్, నరేష్, వెంకటేష్, శ్రీనివాసులు, అశోక్, వెంకటేష్‌లతోపాటు పాండు తల్లిదండ్రులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. 

మరిన్ని వార్తలు