బాల్యంనుంచి పార్టీ అధినేత దాకా

3 Jun, 2014 02:23 IST|Sakshi

కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కామారెడ్డి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. కేసీఆర్ తోబుట్టువుతోపాటు మేనమామలు ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. కేసీఆర్ పూర్వికులు కూడా దోమకొండ మండలం కోనాపూర్(పోసానిపల్లె)లో ఉండేవారు. దీంతో కేసీఆర్‌కు చిన్ననాటి నుంచి ప్రాంతంతో అనుబంధమేర్పడింది.
 కేసీఆర్ అక్కను దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన న్యాయవాది రామారావ్‌కు ఇచ్చారు. కేసీఆర్ చిన్న వయసులోనే అక్క వివాహం కావడంతో అప్పటినుంచి ఆయన అంబారీపేటకు పలుమార్లు వచ్చివెళ్లారని వారి బంధువులు తెలిపారు.

 అంబారీపేట నుంచి వారి కుటుంబం కామారెడ్డికి మకాం మార్చాక ఇక్కిడికి చాలాసార్లు వచ్చివెళ్లారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో అక్క ఇంటికి, ఇతర బంధువుల ఇళ్లకు వచ్చివెళ్తుండేవారు. టీఆర్ ఎస్ పార్టీని స్థాపించాక కామారెడ్డి నియోజకవర్గం ఆ పార్టీకి పట్టుగొమ్మలా మారింది. దీంతో ఎన్నో పర్యాయాలు వచ్చారు. పార్టీ సభలు, సమావేశాలతోపాటు, టీఆర్‌ఎస్ సభల కోసం కూలి పనిలో భాగంగా కామారెడ్డిలో ఆయన కూలీగా పని చేశారు.

 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల ప్రచారం దాకా ఆయన కామారెడ్డి ప్రాంతంలో 20 పర్యాయాలు పర్యటించారు. ఈ ప్రాంతంలో ప్రజల జీవన విధానంతోపాటు, ప్రజలు పడుతున్న సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. నియోజకవర్గంలో ఎక్కడా సభలు, సమావేశాలు జరిగినా ఈ ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లను గురించి మాట్లాడుతుండేవారు. దీంతో సీఎంగా ఎన్నికైన కేసీఆర్ వాటిపై దృష్టిసారిస్తారని ఇక్కడివారు భావిస్తున్నారు.

 కేసీఆర్‌పై ఎన్నో ఆశలు..
 కామారెడ్డి ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ సీఎం పీఠంపై కూర్చున్న నేపథ్యంలో ఆయనపై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారన్న ఆశతో ఉన్నారు. అలాగే విద్య, వైద్యం వంటి వసతుల విషయంలో కూడా కేసీఆర్ చొరవ చూపుతారని భావిస్తున్నారు. అసంపూర్తిగా మిగిలిన *140 కోట్ల తాగునీటి పథకం, ప్రాణహిత-చేవెళ్ల పథకం పనులపై కేసీఆర్ దృష్టి సారించి వాటిని పూర్తి చేయించేందుకు చొరవ చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు