దక్షిణాది నుంచే అనుసంధానం

28 Nov, 2014 01:50 IST|Sakshi
దక్షిణాది నుంచే అనుసంధానం
  • మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం ప్రణాళిక
  •  గోదావరిలో 530 టీఎంసీల మిగులు జ లాలు ఉన్నాయంటున్న జల వనరుల శాఖ
  •  వీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలని యోచన
  •  తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. ఉన్న ప్రాజెక్టులకే నీళ్లు సరిపోవని వెల్లడి
  •  15 ఏళ్ల నాటి లెక్కలను పరిగణన లోకి తీసుకోవడంపై అభ్యంతరం
  • సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని దక్షిణా ది నుంచే మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి మరో నదికి నీటిని మళ్లించడంలో భాగంగా తొలుత దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరిల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది.

    తెలంగాణ పరిధిలోని గోదావరి నది లో మిగులు జలాల లభ్యత ఉందని చెబుతున్న కేంద్ర జల వనరుల శాఖ... ఈ నది నీటిని కృష్ణాకు తరలించే అంశంపై కసరత్తు చేస్తోంది. అయితే గోదావరి నీటి తరలింపును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిలో ఎక్కడా మిగులు జలాలు లేవని.. ప్రస్తుతం లభ్యమవుతున్న జలాలు తమ అవసరాలకే సరిపోవడం లేదని వాదిస్తోంది. అయినా కేంద్రం మాత్రం మొండిగా నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలనే గట్టి పట్టుదలతో ఉంది.
     
    గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తుది మెరుగులు దిద్ది, ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఉత్తరాది నదు లకోసం ‘హిమాలయ నదుల అభివృద్ధి’, దక్షిణా ది నదుల కోసం ‘ద్వీపకల్ప నదుల అభివృద్ధి’ పథకాలను చేపట్టింది. ఇందులో హిమాలయ నదుల అభివృద్ధి పథకం కింద బ్రహ్మపుత్ర, గంగా, నర్మదా తదితర నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిం చినా... బ్రహ్మపుత్ర నదుల నీటి వాడకం విషయంలో పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌తో వివాదాలు ఉన్న దృష్ట్యా దానిని వాయిదా వేసింది. దీంతో దక్షిణాదిలోని నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది.

    గోదావరిపైనే కన్ను..: మహానదిలో సుమా రు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా... వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలన్నది కేంద్ర జల వనరుల శాఖ వాదన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అయితే  కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తెలంగాణ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

    గోదావరిపై ఆధారపడ్డ ప్రస్తుత ప్రాజెక్టులకే నీటి అవసరాలు సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదీగాక ప్రస్తుతం కేంద్రం చెబుతున్న 530 టీఎంసీల అదనపు జ లాలు ఎప్పుడో 15 ఏళ్ల కిందట 75 శాతం డిపెం డబిలిటీతో లెక్కించినవని.. ఇప్పడు ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయని చెబుతోంది. నిర్మాణంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరిలో ఏపీ, తెలంగాణకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు తమ అవసరాలకే సరిపోవని స్పష్టం చేస్తోంది.

    తెలంగాణ పీఠభూమి ప్రాంతం అయినందున గోదావరి ప్రవాహం కింది రాష్ట్రమైన ఏపీకి ఉంటుందని.. అక్కడే అదనపు జలాల అవకాశం ఉంటుందని చెబుతోంది. రాష్ట్ర పరిధిలోని నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదని, అలాకాకుండా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలిస్తామంటే అంగీకరించేది లేదని తెలంగాణ వాది స్తోంది.  విషయాలను ఇటీవల కేంద్రం నిర్వహించిన జల్ మంథన్ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రానికి స్పష్టంగా వివరించినా, వాటిని కేం ద్రం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
     

మరిన్ని వార్తలు