శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బాడీ స్కానర్లు 

1 Nov, 2019 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ప్రయాణికుల తనిఖీకి ఇటీవల అధునాతన బాడీ స్కానర్లను ప్రవేశపెట్టారు. కేవలం రెండు, మూడు సెకన్లలో పూర్తిగా తనిఖీ చేసే ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ట్రయల్‌రన్‌ ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ సూచనల మేరకు ఈ స్కానర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్‌ టెర్మి నల్‌ వద్ద ఏర్పాటు చేసిన వీటిని 3 నెలల పాటు పరిశీలిస్తారు. ట్రయల్స్‌లో భాగంగా డిపార్చర్‌ గేట్‌ నం.3 వద్ద ఉన్న ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ లేన్‌ వద్ద స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ట్రయల్స్‌ విజయవంతమైతే సంబంధిత రెగ్యులేటరీ అనుమతుల మేరకు టెర్మినల్‌ అంతటా ఏర్పాటు చేస్తారు. ఇమేజ్‌ ఫ్రీ స్కానింగ్‌ టెక్నిక్‌ మీద పనిచేసే ఈ స్కానర్‌ వల్ల ఎలాంటి హానీ ఉండదు. ప్రయాణికుల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల అనుమతితోనే వారిని స్కానింగ్‌ చేస్తారు. పలు యూరోప్‌ దేశాలు, అమెరికాలోని అనేక విమానాశ్రయాల్లో ఇప్పటికే భద్రతా తనిఖీల నిమిత్తం బాడీ స్కానర్లను వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు