జర్నీ.. క్యా కర్నా?

9 Apr, 2020 09:48 IST|Sakshi

అప్పుడే బుకింగ్‌.. ఆ వెంటనే కాన్సిలేషన్‌  

లాక్‌డౌన్‌ గడువుముగుస్తోందని ఆశాభావం       

రైల్వే రిజర్వేషన్లకు భారీగా పెరిగిన డిమాండ్‌

లాక్‌డౌన్‌ పొడిగింపునకే ప్రభుత్వాల మొగ్గు?

తాజా పరిణామాలతో ప్రయాణాలన్నీ రద్దు  

తెలుగురాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిలో ఆందోళన

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కలవరం సృష్టిస్తోంది. అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేపుతోంది. అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. మరికొద్ది రోజుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారనే అంచనాలతో నగరవాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే వేళలో.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఈ నెల 15న లాక్‌డౌన్‌ ముగిస్తే సొంత ఊళ్లకు వెళ్లవచ్చని ఆశించారు. ఈ మేరకు రైళ్లలో రిజర్వేషన్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగులకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. కానీ తాజాగా లాక్‌డౌన్‌ పొడిగింపునకే ప్రభుత్వం అనుకూలంగా ఉండడంతో  ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మొన్నటిదాకా రిజర్వేషన్ల  బుకింగ్‌ కోసం ఎదురు చూసినవారు ప్రస్తుతం ప్రయాణాల రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలోనూ రైళ్ల రాకపోకలతో నిమిత్తం లేకుండా, రైల్వేతో  ఎలాంటి సమన్వయం లేకుండా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు అవకాశం కల్పించడం కొంత గందరగోళానికి దారితీసింది.

డిమాండ్‌ అనూహ్యం..
‘లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే జనం హైదరాబాద్‌ వదిలి వెళ్లేందుకు పరుగులు పెడతారేమోనని రిజర్వేషన్లకు డిమాండ్‌ కనిపిస్తోంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ నెల 15 వరకు లాక్‌డౌన్‌ గడువు విధించడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే  రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. 16 నుంచి వారం రోజుల పాటు అన్ని రైళ్లలో ఏసీ, నాన్‌ ఏసీ బెర్తులకు బుకింగ్‌ పెరిగింది. కొన్ని రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు కనిపించింది. వివిధ కారణాలతో నగరంలో చిక్కుకొనిపోయిన వారు లేదా  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన వారు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్‌ కనిపించింది. మరోవైపు కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ తొలగించి తిరిగి మళ్లీ  విధించవచ్చనే వార్తల దృష్ట్యా కూడా చాలామంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ లాక్‌డౌన్‌ పొడిగింపునకే  కేంద్రం, రాష్ట్రం సుముఖంగా ఉండటంతో ఇప్పుడు మరో గత్యంతరం లేక  ప్రయాణాల రద్దు కోసం ముందుకు వస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌పై  నెలకొన్న సందిగ్ధం ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ‘లాక్‌డౌన్‌ పొడిగిస్తారో, తొలగిస్తారో  తెలియనప్పుడు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లు అందుబాటులో ఉంచడం ఎందుకు’ అంటూ ప్రయాణికులు ఆందోళన వ్కక్తం చేస్తున్నారు.

ఎందుకీ గందరగోళం?
ఒకవైపు బుకింగులు, మరోవైపు రద్దుతో ప్రయాణాల రాకపోకలపై నెలకొన్న గందరగోళాన్ని  తొలగించేందుకు రైల్వేశాఖ కొంత మేరకు స్పష్టతనిచ్చింది. ‘కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగిస్తే రైళ్లు నడిచేందుకు అవకాశం ఉండదు.లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆన్‌లైన్‌ బుకింగులు లాక్‌డౌన్‌ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఓపెన్‌ చేసినవి కాదు’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ‘ప్రయాణికులు 3 నెలలు ముందే  బుక్‌ చేసుకొనేందుకు ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది లాక్‌డౌన్‌ కోసం ఉద్దేశించింది కాదు’ అని పేర్కొన్నారు. 

వెంటనే రిఫండ్‌..
ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌లు బుక్‌ చేసుకున్నవారు తిరిగి తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటే నాలుగైదు రోజుల్లోనే రిఫండ్‌ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి  సంజీవయ్య తెలిపారు. గత నాలుగైదు రోజులుగా బుక్‌ చేసుకున్న వారు లాక్‌డౌన్‌ పొడిగింపు వార్తల నేపథ్యంలో తిరిగి రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు