మధ్యమానేరుకు జలసిరి

18 Aug, 2018 03:03 IST|Sakshi
మధ్యమానేరు జలాశయం

మూడు రోజుల్లోగా జలాశయంలోకి ఎస్సారెస్పీ నీరు 

వరద కాల్వ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు 

25 టీఎంసీలు నింపేందుకు అధికారుల చర్యలు

బోయినపల్లి/సిరిసిల్ల: భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దిగువకు వెళ్తున్న ఈ నీటిని వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మధ్యమానేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయానికి శ్రీరాంసాగర్‌ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిరుడు 5 టీఎంసీల నీటిని మళ్లించిన అధికారులు.. ఈ ఏడాది 24 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల ధాటికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నిండుగా పారుతుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 90 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి వచ్చే వరదతో రోజుకు 5–8 టీఎంసీల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. శనివారం నాటికి 30–35 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు నిండితే వరద కాల్వ ద్వారా మధ్యమానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నీరు చేరేందుకు 48 గంటల సమయం పడుతుందని లెక్కకట్టారు. అంటే.. 3 రోజుల్లో మధ్యమానేరులోకి గోదావరి జలాలు వచ్చి చేరనున్నాయి. దాదాపు 21 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. మధ్యమానేరు పూర్తిగా నిండుతుంది. ఈ ప్రాజెక్టు నిండితే.. అక్కడ నుంచి దిగువ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లోకి నీటిని వదిలిపెడతారు. మరోవైపు.. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరుకు నీరు అందించే వీలు కలుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జలాశయాలకు మధ్యమానేరు గుండెకాయలా మారుతుంది. 

ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి 
మధ్యమానేరులో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులు వెంటనే ఊర్లు ఖాళీ చేసి.. పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, బోయినపల్లి మండలం కొదురుపాక, వర్దవెల్లి, నీలోజిపల్లి గ్రామస్తులు కొందరు ఊర్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకు చేరారు. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వారంతా పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. మూడు రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి జలకళ రాబోతుంది. ప్రాజెక్టు నిండితే.. సిరిసిల్ల ప్రాంతంలో కొంత మేరకు భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.

మిడ్‌మానేరుకు వరద నీరు
మహారాష్ట్రలోని నాందేడ్‌ ఎస్‌సీవీపీ, ఆందూర, బాలేగావ్, బాబ్జీ బ్యారేజీల నుంచి రోజూ 9 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 23 టీఎంసీల నీరు నిల్వఉంది. వరుసగా మూడురోజులపాటు నీరు ఇలానే వస్తే ఎస్సారెస్పీలో 30 టీఎంసీలకు పైగా చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఈ మేరకు నీరు చేరితే మధ్యమానేరులోకి వరద కాలువ ద్వారా నీరు వదిలే అవకాశం ఉంది. 
–శ్రీకాంత్‌రావు, ఎస్‌ఈ, మిడ్‌మానేరు 

ఎస్సారెస్పీకి భారీగా వరద 
ఇన్‌ఫ్లో 62,520 క్యూసెక్కులు 
జగిత్యాల అగ్రికల్చర్‌: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వస్తోంది. ప్రాజెక్టులో 1067.4 అడుగుల(24.277 టీఎంసీల) నీటి నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో 42,385 క్యూసెక్కుల వరదనీరు రాగా.. ఏడు గంటలకు 46,940 క్యూసెక్కులకు, 10 గంటలకు 49,240, 11 గంటలకు 58,330, 12 గంటలకు 68,650, మధ్యాహ్నం ఒంటిగంటకు 76,540, సాయంత్రం 4 గంటల వరకు 82,650 క్యూసెక్కు లకు చేరింది. తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు 62,520 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1054.90 (9.214 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు