పిలవని పెళ్లికి వెళ్లి... బీభత్సం సృష్టించారు

25 Jul, 2015 20:26 IST|Sakshi

హైదరాబాద్ (గోల్కొండ) : ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి భోజనాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు షాదీఖానాలో యువకులు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ దాడి గోల్కొండలో సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ లైన్స్‌కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ కుమారుడు మహ్మద్ ఆమెర్ వివాహం గోల్కొండ జీన్సి బజార్‌కు చెందిన యువతితో శుక్రవారం రాత్రి గోల్కొండ బడా బజార్‌లోని మిర్జా గార్డెన్లో జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వధూవరుల కుటుంబాలు అప్పగింతల కార్యక్రమంలో పాల్గొనగా, డైనింగ్ హాల్‌లోకి వచ్చి 40 మంది యువకులు భోజనాలు చేస్తున్నారు. వీరిని చూసిన వరుడి తండ్రి మహ్మద్ సిద్దిఖ్ అక్కడకు వెళ్లి.. పిలవకుండానే వచ్చి భోజనాలు చేస్తున్నారంటూ ఆ యువకులను నిలదీశారు. దాంతో వారు తమ వెంట తెచ్చుకున్న తల్వార్లు, రాడ్లతో సిద్దిఖ్పై దాడి చేశారు.

అతడి కేకలు విని బంధువులు డైనింగ్ హాల్‌లోకి వెళ్లారు. వారిపై కూడా యువకులు కత్తులు, రాడ్లతో దాడి చేసి అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరికేస్తామంటూ.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని దబాయించారు. గాయపడ్డవారు కింద పడిపోగా కొందరు యువకులు మహిళలపై కూడా దాడిచేశారు. సిద్దిఖ్ భార్య గౌసియా బేగాన్ని మెడపట్టి లాగి రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఆమె మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. షాదీఖానాలోని వస్తువులను కర్రలు, రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. మహ్మద్ సిద్దిఖ్ కారు అద్దాలు పగలకొట్టారు. గంటపాటు విధ్వంసం సృష్టించి దుండగులు పారిపోయారు. రాత్రి రెండు గంటలకు మహ్మద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు గోల్కొండ ఖల్ఫాన్ తెగకు చెందిన వారని మహ్మద్ సిద్దిఖ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు