పేరుకే పెంపు!

12 Mar, 2015 04:53 IST|Sakshi
పేరుకే పెంపు!

విద్యకు నిధులు పెరిగినా.. తగ్గిన వాటా!
గతేడాది 10.88 శాతం కేటాయించగా ఈసారి 9.7 శాతమే
ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 11,216 కోట్లు
కేంద్ర పథకాల కింద భారీగా తగ్గిన నిధులు..
కేజీ టు పీజీకి నిధుల్లేవ్, మోడల్ స్కూళ్లు, ఆర్‌ఎంఎస్‌ఏకు అరకొర

 
 సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి ఈసారి బడ్జెట్‌లో నిధులు పెరిగాయి. కానీ గతంకన్నా కేటాయింపుల శాతం తగ్గింది. గతేడాది విద్యారంగానికి రూ. 10,956.36 కోట్లు(మొత్తం బడ్జెట్‌లో 10.88%) కేటాయించగా, ఈసారి రూ. 11,216.10 కోట్లు(9.7%) దక్కాయి. ప్రధానంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సర్కారు పెద్దపీట వేసింది. వర్సిటీల అభివృద్ధికి కేటాయింపులను పెంచింది. పాఠశాల విద్యకు మాత్రం ప్రణాళిక కేటాయింపులను కుదించింది. మోడల్ స్కూల్స్ వంటి పథకాలను  కేంద్రం రద్దు చేయడం, ఇతర పథకాలకూ నిధుల్లో కోత విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా, కేజీ టు పీజీ పథకానికి ఈసారి నిధులను కేటాయించలేదు. ప్రైవేటు స్కూళ్లలో 25% పేద విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉచిత విద్యను అందించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కే జీ టు పీజీకి పైసా కేటాయించలేదు. పాఠశాల విద్యలో ప్రణాళిక వ్యయం కింద గత ఏడాది రూ. 3,510.56 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది.
 
 గురుకులాల్లో భాగంగానే కేజీ టు పీజీ
 వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అవసరమైతే తెలంగాణ గురుకుల విద్యాలయాల నిధులనే ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందుకే గురుకులాలకు రూ. 75 కోట్లను కేటాయించింది. మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటికే ప్రారంభించిన స్కూళ్ల కోసం రూ. 216 కోట్లు కేటాయించింది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకానికి పెద్దగా నిధులివ్వకపోగా, సర్వ శిక్ష అభియాన్‌కూ రాష్ట్ర వాటా నిధులను తగ్గించింది. మొత్తానికి కేంద్ర సహకారంతో కొనసాగే పథకాలకు రాష్ర్టం తరఫున గత ఏడాది రూ. 2,795.48 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 713.35 కోట్లను మాత్రమే ఇచ్చింది. బాసరలోని ట్రిపుల్ ఐటీ నిర్వహణ కోసం గతేడాది రూ. 119 కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని రూ. 93 కోట్లకు తగ్గించింది.
 
 కేంద్ర నిధులపై సన్నగిల్లిన ఆశలు
 కేంద్ర పథకాలైన సర్వశిక్ష అభియాన్ కు(ఎస్‌ఎస్‌ఏ) గత ఏడాది కేంద్రం నుంచి రూ. 3,307.29 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఈసారి కేవలం రూ. 929.39 కోట్లు మాత్రమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే ఉన్నత విద్యలో గతేడాది రూ. 101.60 కోట్లుగా ఉన్న కేంద్ర నిధుల అంచనాను ఈసారి రూ. 50.61 కోట్లుగానే పేర్కొంది.
 
 నిరాశే మిగిల్చింది
బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ నిరాశ కలిగించేలా ఉంది. మాధ్యమిక విద్యకు నిధులు తగ్గాయి. నిధులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.           
 - వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ నేతలు
 
 చేతల్లో కనిపించలేదు
 కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అంటూ సీఎం గొప్పలు చెప్పారే తప్ప అందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. 10 శాతానికంటే తక్కువ నిధులను కేటాయించారు.
 -  నర్సిరెడ్డి, రవి, యూటీఎఫ్ నేతలు
 
 కేజీ టు పీజీకి నిధులేవీ?
 బడ్జెట్‌లో 30% నిధులను విద్యాశాఖకు కేటాయిస్తేనే కేజీ టు పీజీ అమలవుతుంది. దీన్ని 2016లో ప్రారంభించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి నిధులు కేటాయిస్తే ఏర్పాట్లు వేగంగా జరిగేవి.
 - కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి,
 హర్షవర్థన్‌రెడ్డి, టీపీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్‌టీయూ నేతలు

మరిన్ని వార్తలు