మంత్రులకు ‘నిధుల’ రోడ్లు

5 Dec, 2017 02:36 IST|Sakshi

కావాలనుకున్న చోట్ల నిర్మాణం కోసం రూ.30 కోట్ల చొప్పున కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంత్రులకు ప్రభుత్వం ‘రోడ్ల’నజరానా ప్రకటించింది. వారు కావాలనుకున్న చోట రహదారుల నిర్మాణానికి వీలుగా ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల మేర ప్రత్యేక నిధుల కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి ఈ నిధులు అందిస్తారు. కార్పొరేషన్‌ ఈ నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటుంది. ప్రస్తుతానికి రూ.450 కోట్లు ఈ రూపంలో మంజూరు చేసేందుకు ప్రభు త్వం అంగీకరించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించారు.

నేతల ఒత్తిళ్లతో..: రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీంతో గ్రామాల్లోని రోడ్ల దుస్థితిపై ప్రజలు నేతలను నిలదీస్తున్నారు. ఆయా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా నేతల నుంచి సీఎంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రస్తుతానికి మంత్రుల నియోజకవర్గాల పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

త్వరలోనే టెండర్లు..: మంత్రులు తాము కావాలనుకున్న రహదారులను ఎంపిక చేసి రోడ్లు భవనాల శాఖకు ప్రతి పాదనలు పంపుతారు. అధికారులు వాటిని పరిశీలించి డీపీఆర్‌లు రూపొందిస్తారు. తర్వాత మంత్రులకు ప్రత్యేకిం చిన నిధుల కింద టెండర్లు పిలిచి పనులు చేపడతారు. ఇక కొత్త కలెక్టరేట్‌ భవనాలు, ఎమ్మెల్యేల నివాస భవన సముదాయాల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, ఎన్‌హెచ్‌ఏఐకి కేటాయించిన ఆరు రోడ్ల నిర్మాణంలో జాప్యం తదితర అంశాలపైనా తుమ్మల సమీక్షించారు. 

మరిన్ని వార్తలు