అనుసంధానం.. అటకెక్కినట్లే!

10 Feb, 2020 03:37 IST|Sakshi

నిధుల కేటాయింపుపై స్పష్టత కరువు

మౌలిక వసతుల కల్పన కింద జలరవాణా మార్గాలకు నిధులు

గోదావరి–కృష్ణా–కావేరి అనుసంధాన ప్రక్రియ మరింత ఆలస్యం  

కేంద్ర బడ్జెట్‌లో కానరాని నదుల అనుసంధానం ప్రస్తావన 

సాక్షి, హైదరాబాద్‌ : లభ్యత జలాలు అధికంగా ఉన్న నదీ ప్రాం తాల నుంచి నీటి కొరతతో అల్లాడుతున్న నదులకు అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం అటకెక్కించినట్లే కనబడుతోంది. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యమిస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో దీని ప్రస్తావననే విస్మరించింది. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల కేటాయింపుపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన బడ్జెట్‌లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. దీంతో అసలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఆసక్తి కేంద్రానికి ఉందా.. అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఆశలపై నీళ్లు.. 
దేశవ్యాప్తంగా మొత్తంగా నదుల అనుసంధానానికి 30 రకాల ప్రణాళికలను కేంద్రం రచించింది. ఇందులో ఇప్పటికే కెన్‌–బెట్వా, దామనగంగ–పింజాల్, పార్‌–తాపి–నర్మద, పార్‌బటి –కలిసింధ్‌–చంబల్, మహానది–గోదావరి, గోదావరి–కృష్ణా–కావేరి (గ్రాండ్‌ ఆనకట్‌) నదుల అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే రాష్ట్రాల్లో ప ర్యటించి చర్చలు జరిపింది. మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల ఆమోదం మేరకు కెన్‌–బెట్వా నదుల అనుసంధానాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధ మైంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణకు మేలు చేసే గోదావరి–కావేరి అనుసంధానంపైనా స్పష్టత లేదు. గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) కొత్తగా జనంపేట నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్నీ తెలంగాణ తిరస్కరించడంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎన్‌డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. ఇచ్చంపల్లి వీలు కాకుంటే తుపాకులగూడెం నుంచి గోదావరి నీటి ని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి స్పందన లేదు. ఒకవైపు అనుసంధాన మార్గాలపై ఇంతవరకూ స్పష్టత లేకపోగా మరోవైపు కేంద్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో అనుసంధాన ప్రక్రియ ఇప్పట్లో ముందుకెళ్లడం కష్టసాధ్యంగానే ఉంది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తన ప్రసంగంలో జల రవాణాకు వీలుగా ఈ ఏడాది దుభ్రి–సాధియా జల మార్గానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి 890 కిలోమీటర్ల జలమార్గాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది మినహా నదుల అనుసంధాన ప్రస్తావన లేకపోవడం దీనికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు