‘పెళ్లి’కి నిధుల్లేవ్‌!

16 Nov, 2019 09:47 IST|Sakshi

షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలకు కాసుల కొరత

ఏళ్లు గడుస్తున్నా సొమ్ము అందలేదని లబ్ధిదారుల ఆవేదన

ఇప్పటికే పెండింగ్‌లో సగానికి పైగా దరఖాస్తులు

‘నగరంలోని వారాసిగూడకు చెందిన ఖాజాబీ సరిగ్గా నాలుగేళ్ల కిందట షాదీ ముబారక్‌ పథకం కింద ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందలేదు. దీంతో ఈ నెల మొదటి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్థిక సహాయం ఇప్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ రవికి మొర పెట్టుకుంది. దీనిపై స్పందించిన జేసీ అక్కడే ఉన్న జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారిని పరిశీలించాలని ఆదేశించారు’’ ఇదొక ఖాజాబీ సమస్య కాదు..పాతబస్తీకి చెందిన ఎందరో ఇలా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌’ పథకాలను నిర్లక్ష్యం, నిధుల కొరత వెంటాడుతున్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉన్నా..నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పోసప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పేద కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతుండగా..మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది మంజూరుతో ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా ఆర్థిక సహాయం మాత్రం బ్యాంక్‌ ఖాతాలో జమ కావడం లేదు. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుట్టినా సాయం మాత్రం అందని దాక్ష్రగా తయారైంది. ఫలితంగా పేద కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ  చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు పేదకుటుంబాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నా..ఆర్థిక సహాయం అంతంత మాత్రంగా తయారైంది. 

పథకం ఇలా...
ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చెందిన..18 ఏళ్లకు పైబడిన ఆడబిడ్డల  వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉన్న ఆడబిడ్డల కుటుంబాలు ఆర్హులు..ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్‌లైన్‌ ద్వారా రిజిష్టర్‌ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. ఫైనల్‌గా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక..నిధులు మంజూరు చేస్తారు.

షాదీ ముబారక్‌ పరిస్థితి ఇదీ...
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఈ ఏడాది మరో 9120  దరఖాస్తులు వచ్చి చేరాయి. మొత్తం 14220 దరఖాస్తులకు గాను 274 తిరస్కరణకు గురయ్యాయి.  మొత్తం మీద 10,049 దరఖాస్తులకు మంజూరు లభించగా, అందులో సుమారు 4237 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీకి పంపకుండా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో మూలుగుతున్నాయి. ట్రెజరీ పంపిన వాటిలో 54 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద 5758 బిల్లులకు మాత్రమే పీడీ అకౌంట్లలో డిపాజిట్‌ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలో సైతం గతేడాదికి సంబంధించి 671 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఈ ఏడాది కొత్తగా 1385 దరఖాస్తులు వచ్చాయి. 19 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1587 దరఖాస్తులకు మంజూరు లభించగా, 606 బిల్లులు ట్రెజరీకు పంపలేదు. 184 బిల్లులు ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉండగా, 797 బిల్లులకు సంబందించిన డిపాజిట్‌ మాత్రమే పీడీ అకౌంట్లలో జమ అయ్యాయి.
రంగారెడి జిల్లా పరిధిలో గతేడాది 1084 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ  ఏడాది కొత్తగా 1770 కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 243 తిరస్కరణకు గురయ్యాయి. 2161 దరఖాస్తులకు మంజూరు లభించింది. 986 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీ పంపకుండా పెండింగ్‌లో ఉండగా, కేవలం 1175 బిల్లులకు మాత్రమే నిధులు పీడీ ఖాతాలో డిపాజిట్‌ అయ్యాయి. 

కల్యాణ లక్ష్మి పరిస్థితి ఇదీ..
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గతేడాది 355 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏదాడి ఇప్పటి వరకు కొత్తగా 923 దరఖాస్తులు వచ్చాయి. 30 తిరస్కరణకు గురయ్యాయి. 896 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 9 బిల్లులు ట్రెజరీకి పంపకుండా ఆర్డీవో వద్దనే ఉంచారు. ట్రెజరీ వద్ద 95 బిల్లులు పెండింగ్‌ ఉండగా, కేవలం 799 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది.   
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలో గతేడాది 259 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 926 దరఖాస్తులు వచ్చి చేరాయి. 16 తిరస్కరణకు గురయ్యాయి. 927 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 30 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ఇక ట్రెజరీ వద్ద 185 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 712 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 381 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1202 దరఖాస్తులు వచ్చి చేరాయి. 33 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 1109 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 172 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ట్రెజరీ వద్ద 29 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, మొత్తం మీద 908 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు