జంతువులకూ దహనవాటికలు

8 Jan, 2019 09:34 IST|Sakshi

శాస్త్రీయంగా దహనక్రియలు

మూడు ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ

10 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మాణం  

అంచనా వ్యయం రూ.3.82 కోట్లు

ఆర్‌ఎఫ్‌క్యూలు ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ  

సాక్షి, సిటీబ్యూరో: జంతు కళేబరాలను నగరంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుండడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నగరంలో జంతువుల దహనక్రియలకు ఎలాంటి సదుపాయాల్లేవు. కుక్కలతో సహా పలు రకాల జంతువులు మరణించినప్పుడు వాటిని శాస్త్రీయంగా అంతం చేసే సదుపాయాల్లేవు. దీంతో జంతు కళేబరాల దుర్గంధంతో పరిసరాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతే కాకుండా తాము ప్రాణప్రదంగా పెంచుకున్న జంతువుల అంత్యక్రియలకూ తగిన సదుపాయాలుండాలని శునక ప్రేమికులు, జంతువుల దహనానికి శాస్త్రీయ పద్ధతులుండాలని సామాజికవేత్తల నుంచి ఎంతో కాలంగా డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో విగతజీవులైన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడానికి మూడు ప్రాంతాల్లో జంతు శ్మశానవాటికల ఏర్పాటుకు  జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇందుకుగాను విద్యుత్‌ దహనవాటికలు ఏర్పాటు చేయాలనుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా నగరాల్లోని విద్యుత్‌ దహనవాటికల తీరును పరిశీలించారు.

ఈ నేపథ్యంలో గ్యాస్‌ ఆధారిత దహనవాటికలతో పాటు బ్లాక్‌ హోల్‌ టెక్నాలజీతో మంచి ఫలితాలుంటాయని కొన్ని ఏజెన్సీలు జీహెచ్‌ఎంసీని సంప్రదించాయి.  ప్లాస్మా టెక్నాలజీతో తాము ఏర్పాటు చేస్తామని, అది అన్ని విధాలా మేలైనదని మరో ఏజెన్సీ ముందుకొచ్చింది. బ్లాక్‌హోల్‌ టెక్నాలజీలో మ్యాగ్నటిక్‌ పవర్‌తో కాలుస్తారని ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పీవీ కృష్ణారావు తెలిపారు. వ్యర్థాల్లోని ప్లాస్టిక్‌ బాటిళ్లు తదితరమైన వాటిని కాల్చడం ద్వారా వెలువడే ద్రావణాలు, వ్యర్థాల నుంచి వెలువడే ఆయిల్స్‌ తదితరమైన వాటితో మండించడం ప్లాస్మా టెక్నాలజీలో ఉంటుందన్నారు.   ఈ నేపథ్యంలో ఏ టెక్నాలజీతో మేలైన ఫలితాలుంటే ఆ టెక్నాలజీని వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ భావించింది. అందుకుగాను తమను సంప్రదించిన ఏజెన్సీలే కాకుండా పేరెన్నికగన్న ఏ ఏజెన్సీ అయినా వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌క్యూ)లను ఆహ్వానించింది. నగరంలో నిత్యం మృతి చెందుతున్న జంతువులను పరిగణనలోకి తీసుకొని మొత్తం మూడు ప్రాంతాల్లో 10 టన్నుల మేర మృత కళేబరాలను శాస్త్రీయంగా దహనం చేసేందుకు రూ.3.82 కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌ఎఫ్‌క్యూలను ఆహ్వానించింది. ఈ దహనవాటికలు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) నిబంధనల కనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దహనక్రియల అనంతరం వెలువడే బూడిద తదితరమైన వాటిని సైతం ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. 

తొలుత మూడు ప్రాంతాల్లో...  
జీహెచ్‌ఎంసీలో తొలి దశలో నాలుగుదిక్కులా నాలుగు జంతు దహన వాటికలను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, తొలుత మూడు చోట్ల మాత్రం ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎఫ్‌క్యూ(టెండరు) ఆహ్వానించారు. జవహర్‌నగర్, గాజులరామారం, ఫతుల్లాగూడల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం  జంతువుల మృత కళేబరాలను జవహర్‌నగర్, ఆటోనగర్‌ తదితర ప్రాంతాల్లో పూడ్చివేస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయంగా జంతువుల మృత కళేబరాలను దహనం చేసేందుకు అన్ని విధాలా అర్హతలున్న ఏజెన్సీని జీహెచ్‌ఎంసీ ఎంపిక చేయనుంది.  

10 టన్నుల సామర్థ్యంతో...
నగరంలో నిత్యం మృతి చెందుతున్న జంతువుల్లో 20 వరకు ఎద్దులు, ఆవులు, బర్రెలు వంటి పెద్ద జంతువులుంటున్నాయి. కుక్కలు తదితర చిన్న జంతువులు దాదాపు 60 వరకు ఉంటున్నట్లు అంచనా. వీటిల్లో పెద్ద జంతువులు ఒక్కొక్కటి దాదాపు 400 కేజీలు, చిన్నవి  దాదాపు 20 కేజీలు ఉంటాయని అంచనా. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున దాదాపు 9టన్నుల బరువైన మృత కళేబరాల్ని తరలిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మూడు చోట్లా వెరసి రోజుకు 10టన్నుల మేర దహనం చేయగల సామర్ధ్యం ఉండేలా ఏర్పాటుకు  టెండరును ఆహ్వానించారు.

నిర్వహణ ఇలా..
లొకేషన్‌తో సహ మృతకళేబరం ఎక్కడ ఉందో తెలియగానే టోకెన్‌ నెంబర్‌ కేటాయిస్తారు.
సంబంధిత క్షేత్రస్థాయి జీహెచ్‌ఎంసీ సిబ్బంది కి సమాచారం చేరవేస్తారు.
జంతువులను తరలించే వాహనం అక్కడకు చేరుకుంటుంది. వీటికి జీపీఎస్‌ అమర్చుతారు.
మృతకళేబరంతో వాహనం శ్మశానవాటికకు చేరుకుంటుంది.  
దహన క్రియలు పూర్తి చేస్తారు. విషయాన్ని నమోదు చేసి టోకెన్‌ పరిష్కారమైనట్లు పేర్కొంటారు.    

జోన్ల వారీగా మృతకళేబరాలు (బరువు కిలోల్లో)
జోన్‌    పెద్ద జంతువులు    చిన్నవి    మొత్తం బరువు
వెస్ట్‌జోన్‌    400    120    520    
నార్త్‌జోన్‌    800    220    1020
సెంట్రల్‌జోన్‌    1600    300    1900
ఈస్ట్‌జోన్‌    1200    300    1500
సౌత్‌జోన్‌    4000    200    4200
మొత్తం    8000    1140    9140  

మరిన్ని వార్తలు