గానుగాడేనా?

14 Sep, 2015 00:08 IST|Sakshi
గానుగాడేనా?

రెక్కలు ముక్కలు చేసుకుని తీపిని పంచిన చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతున్నా నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం తేలక అగమ్యగోచరంగా మారింది. నేటివరకు ఫ్యాక్టరీ మరమ్మతులు ప్రారంభం కాక... పంట అగ్రిమెంటుకు నోచుకోక... బకాయిలు చేతికి రాక.. గానుగాడే సమయం ముంచుకొస్తుంటే.. చెరకు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. అసలే కరువు కాలం.. ఆపై కాస్తోకూస్తో పండిన పంటకు తగిన ప్రతిఫలం ప్రశ్నార్థకంగా మారింది. ఒకరో ఇద్దరో కాదు... రెండువేల మంది రైతుల వేదన ఇది.
- ఎన్డీఎస్‌ఎల్ భవితవ్యం తేలేనా?
- సమయం దగ్గర పడుతున్నా కదలిక కరువు
- ఆందోళనలో చెరకు రైతులు
- సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపులు
- రూ.6.64 కోట్ల బాకాయిలపై సందిగ్ధం
మెదక్:
మెదక్ మంబోజిపల్లి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్డీఎస్‌ఎల్) పరిధిలోని 12 మండలాల్లో 2,400 చెరకు రైతులున్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ఫ్యాక్టరీ... ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. నిర్వహణ లోపంతో అంతంత మాత్రంగా నడుస్తున్న ఫ్యాక్టరీ... రైతులకు కోట్ల రూపాయల బకాయిలు పడింది. ఫలితంగా... మంజీరా తీరంలో చెరకు పంట గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఏ ఏడు గానుగకు కేవలం 90 వేల టన్నుల చెరకు పంట మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. నిర్వహణ కష్టంగా మారిన ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని కొంత కాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకార విధానంలో ఫ్యాక్టరీ నడిపితే సత్ఫలితాలొస్తాయన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం.
 
ఇందులో భాగంగానే... ప్రైవేటు యాజ మాన్యం నుంచి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయమై ఆస్తుల మదింపు ప్రక్రియ చేపట్టింది. ఈ బాధ్యతను ఎఫ్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్టు తెలిసింది.
 
గానుగాడే సమయం...
చెరకు పంట గానుగాడే సమయం దగ్గర పడుతున్నా ఇంత వరకు ఫ్యాక్టరీ భవితవ్యంపై తుది నిర్ణయం ఖరారు కాలేదు. సాధారణంగా పంట గానుగాడటానికి ఆరు నెలల ముందే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులతో పంట కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలి. కానీ మంభోజిపల్లి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారంతో ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యం ఎలాంటి కార్యకలాపాలూ చేయడం లేదు. పైగా ఫ్యాక్టరీలో గానుగాడాలంటే కనీసం మూడు నెలల ముందే మరమ్మతులు ప్రారంభించి యంత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరో రెండు నెలల్లో చెరకు నరికే సమయం వస్తున్నా... ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

గతేడాది చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్లో సీఎం చొరవతో కొన్ని విడుదలైనప్పటికీ... ఇంకా రూ.6.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. అటు ఫ్యాక్టరీ సరిగ్గా నడవక... ఇటు బకాయిలూ రాకపోవడంతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు చెరకు తరలిద్దామనుకున్నా... వారు అనుమతించే అవకాశాలు తక్కువేనంటున్నారు రైతులు. మంభోజిపల్లి ఫ్యాక్టరీలో ఒకప్పడు మూడు లక్షల టన్నుల చెరకు గానుగాడేవారు. ఈ ఏడు ఇది 90 వేల టన్నులకే పరిమితమైంది. కాగా ఇటీవల ఎన్డీఎస్‌ఎల్ పరిధిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన చెరకు రైతులు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ మూతపడటానికి వీలు లేదని, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు