గెలిస్తేనే ఆ పార్టీలు నిలిచేది..! 

13 Apr, 2019 04:21 IST|Sakshi

జాతీయ పార్టీలకు చావోరేవో కానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ మనుగడను తేల్చనున్న మే 23

ఎవరు నష్టపోయినా రాష్ట్రంపై ఆశలు దాదాపు వదులుకోవాల్సిందే

కాంగ్రెస్‌కయితే తీరని నష్టం మిగిల్చే అవకాశం... కమలనాథులకూ కష్టమే

కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే దానిపైనా ఆధారపడ్డ భవిష్యత్తు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారుతాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పరాజయం పాలవుతూ వస్తున్నాయి. మే 23న రానున్న లోక్‌సభ ఫలితాలు ఆయా పార్టీల మనుగడపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ దూకుడు ముందు నిలబడలేకపోతున్న రెండు ప్రధాన జాతీయ పక్షాలకు లోక్‌సభ ఎన్నికల్లోనూ కనీసస్థాయి ఫలితాలు కూడా రాని పక్షంలో రాష్ట్రంలో ఆ పార్టీలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమేననే చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కొద్దో గొప్పో నెట్టుకురావచ్చని, ఫలితాలు తారుమారై అది కూడా జరగకపోతే మాత్రం రెండు జాతీయ పార్టీలపై ఈసారి తీవ్ర ప్రభావం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.  

భవిష్యత్తుపై ఆశలు ‘గల్లంతే’ 
మరో ప్రధాన జాతీయపార్టీ బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తును కూడా లోక్‌సభ ఎన్నికలు నిర్దేశించనున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఏ ఎన్ని కల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ఆ పార్టీ ఈసారి బ్యాలెట్‌ బాక్సుల ముందు బొక్కాబోర్లా పడితే రాష్ట్రంలో నిలదొక్కుకోవడమే కష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ పార్టీకి ఉన్న గట్టిపట్టు సడలిపోయిందని, ఈసారి లోక్‌సభ ఫలితాల్లో కనీసస్థాయిలో ఓట్లు రావడంతోపాటు జంటనగరాల్లో ఒక పార్లమెంటు స్థానం కూడా గెలవలేకపోతే కమలనాథులకు కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ సారథ్యంలో మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే కొంత మనుగడ సాధ్యమవుతుందని, అది కూడా రూటు మారితే మాత్రం ఇక దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో ఔటయినట్టేనని బీజేపీనేతలే అంటున్నారు.

‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ వ్యూ హం నిర్దేశించడంలో జాతీయ నాయకత్వం, అమలు చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమయ్యాయి. కేంద్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాన్ని రాజకీయంగా చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంది. 2014 ఎన్నికలు ముగిసిన తొలినాళ్లలో ఆ దిశలో కొంత కసరత్తు చేసిన జాతీయ నా యకత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. మొక్కుబడి వ్యూహాలను మాత్రమే అమలు చేసింది. అప్పుడే ఇత ర పార్టీల్లోని గట్టినేతలను పార్టీలోకి తీసుకుని 2018 ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొని ఉంటే ఇప్పుడు కీలకంగా ఉండేవాళ్లం. కానీ అది జరగలేదు.

ఈ ఎన్నికల్లోనూ ప్రతిభ చూపెట్టకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే పార్టీ పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు’అని బీజేపీ రాష్ట్రస్థాయి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంమీద ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయ స్థాయి రాజకీయ వ్యూహం చేస్తున్న ప్రాంతీయపార్టీ టీఆర్‌ఎస్‌ ముందు ఈ రెండు జాతీయపార్టీలు నిలుస్తాయా? లోక్‌సభ ఎన్నికల్లో కనీసస్థాయిలో అయినా ఫలితాలు సాధించి కొంతమేరైనా నిలదొక్కుకుంటా యా? పేరుకే జాతీయ పార్టీలుగా మిగిలిపోతాయా? ఓటరన్న ఏం చేస్తాడన్నది మే 23న తేలాల్సిందే!

కాంగ్రెస్‌.. ఖల్లాసే 
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం, ఆ పార్టీ నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతుండటంతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు కేడర్‌ లేకుండా పోయింది.లోక్‌సభ ఫలితాలు ప్రతికూలంగా వచ్చి కనీస ప్రతిభ కనబర్చకపోతే మాత్రం ఖల్లాసయినట్టేనని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం 2 స్థానాల్లో గెలవడంతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన సీట్లు వస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందనే చర్చ పార్టీలో బహిరంగంగానే జరుగుతోంది. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీలోని ముఖ్యులంతా వెళ్లిపోతున్నారు.

ఇప్పుడు మా పార్టీలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే కీలక నేతలున్నారు. వారిలో దాదాపు అందరూ ఈ సారి లోక్‌సభ బరిలో దిగారు. ఇప్పుడు వారు కూడా గెలవకపోతే ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలు లేనట్టే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీ కేడర్‌ నిలబడే పరిస్థితి ఉండదు. మరికొందరు నేతలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారు. లోక్‌సభ ఫలితాలు ఏమాత్రం తారుమారైనా మా ఉనికి గల్లంతే’అని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, లోక్‌సభ ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైతే మాత్రం ఇంకొంత మంది జంప్‌ అవుతారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికల్లో కనీస స్థాయిలో సీట్లు, ఓట్లు రాకపోతే మాత్రం పార్టీకి సారథ్యం వహించడం కూడా సాధ్యం కాదని, అలాంటి పరిస్థితుల్లో పార్టీ కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని, లేదంటే తమిళనాడు తరహా పరిస్థితులు ఏర్పడతాయనే అభిప్రాయం కాంగ్రెస్‌ పార్టీలోనే వ్యక్తమవుతోంది.  

మరిన్ని వార్తలు