‘మాలలను అణచివేసే కుట్ర’

23 Mar, 2017 04:09 IST|Sakshi
‘మాలలను అణచివేసే కుట్ర’

హైదరాబాద్‌: రాష్ట్రంలో మాలలను అణిచివేసేందుకు చూస్తున్నారని, అందులో భాగంగానే మాలల పోరు మహాగర్జన సభకు అనుమతి నిరాకరించారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి అధ్యక్షుడు ఆవుల బాలనాథం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలను ఒక్కతాటి పైకి తెచ్చి.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మాలలను ఐక్యం చేశామన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఈ నెల 26న భారీ బహిరంగసభ ఏర్పాటుకు నిర్ణయిం చామని.. అయితే ప్రభుత్వం అనుమతి నిరాకరిం చిందన్నారు.

అసెంబ్లీ సమావేశాల తరువాత నిర్వహణకు అనుమతి అడిగినా.. నిరాకరించడం మాలలపై ప్రభుత్వానికి ఉన్న కక్ష సాధింపు దోరణిని తెలియజేస్తోందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మాలలు, మాదిగలను పిలిపించి వారి సమస్యలు తెలుసుకునేవారని, ఇద్దరికీ న్యాయం జరిగేలా చూసేవారని, కాని ప్రస్తుతం రాచరిక ప్రభుత్వం, నియంత ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.

ఒక పక్షం వారికి తొత్తుగా మారి మరో వర్గం వారిని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ అంశాన్ని ఎవ్వరు లేవనెత్తినా రాష్ట్రం అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి సభ నిర్వహణను వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి జి.నర్సింగరావు, కార్యదర్శి బిర బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, నగర అధ్యక్షుడు జంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు