పోలీసుశాఖలో.. 610 కిరికిరి

21 Jun, 2014 05:39 IST|Sakshi
పోలీసుశాఖలో.. 610 కిరికిరి

జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మెదక్ జిల్లాలో చదివారు.. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం చూస్తే ఆమె మెదక్ జిల్లావాసురాలు అవుతుంది. కానీ, పుట్టి పెరిగింది, తల్లిదండ్రులు నివాసం, ఉద్యోగ రిక్రూట్‌మెంట్ అన్నీ నల్లగొండలోనే. మరి ఆమెను స్థానికురాలు అనాలా..? స్థానికేతరరాలు అనాలా..? ఇప్పుడు జిల్లా పోలీసుశాఖలో ఇదే అయోమయం నెలకొంది.. !!
 
 పోలీసుశాఖలో 610 జీఓ సాక్షిగా కిరికిరి నడుస్తోంది. జిల్లాకు చెందినవారే అయినా, రిక్రూట్‌మెంట్ ఇక్కడే జరిగినా ‘స్థానికత’ విషయంలో సాంకేతికంగా ఇతర జిల్లాకు చెందిన వారవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 610 జీఓ నిబంధనల మేరకు గుర్తించిన వారిలో 46మంది స్థానికేతరులుగా తేలారు. కాగా, వీరిలో 15మంది నిజంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వీరి విషయంలో ఎలాంటి వివాదమూ లేదు. కానీ, మిగిలిన 31మందిది సొంత జిల్లా నల్లగొండ.

కానీ, స్థానికత మాత్రం ఇతర జిల్లాకు చెందినవారిగా చూపెడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. పదో తరగతి పూర్తయ్యేలోపు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానిక ప్రాంతం అవుతుందన్న నిబంధన ఇప్పుడు సమస్యగా మారింది. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం 31మంది పోలీసు ఉద్యోగులు నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి, 610 జీఓ నిబంధనల మేరకు వారు ఇక్కడినుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో సొంత జిల్లాను వదిలి, వేరే జిల్లాకు ఎలా వెళతాం అంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం స్టడీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఎలా..? ‘పేరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్’ను  పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలన్నది వీరి డిమాండ్.
 
ప్రభుత్వం దృష్టికి సమస్య..
 ఇప్పటికే ఈ అయోమయం గురించి ప్రభుత్వం దృష్టికి కొందరు తీసుకెళ్లారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ సమస్య దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నందున ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నా, 610 జీఓను తక్షణం అమలు చేయడానికి అధికారులు నడుంబిగించడంతో ఈ 31మంది సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాము నల్లగొండ జిల్లాలో రిక్రూట్ అయినా, నాన్‌లోకల్ అన్న పేరున ఇతర జిల్లాకు పంపిస్తే, అక్కడి అధికారులు తమకు విధుల్లో చేర్చుకోకుంటే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

‘610 జీఓ ఉద్దేశం తెలంగాణ ప్రాంతానికి చెందని వారిని బయటకు పంపడం. కానీ, తెలంగాణ రాష్ట్రం వారిని, తెలంగాణలోని మరో జిల్లాకు పంపడం ఏమిటి..? ఇదంతా కొందరు తమ పదోన్నతులు తేలిక కావడానికి, లిస్టులో పైకి ఎగబాకడానికి సృష్టిస్తున్న వివాదం. ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ఇచ్చేదాకా మరో 2 నెలలు ఆగితే సరిపోతుంది కదా..’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. కాగా, ఇబ్బందికరంగా ఉన్న లోకల్, నాన్-లోకల్ వివాదం గురించి ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు వెళ్లాయని చెబుతున్నారు.

అయితే దీనికి సంబంధించి ‘పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పరిష్కారమవుతుంది..’ అని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందా అని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆంధ్రా ప్రాంత అధికారి కావాలనే ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు