'గబ్బర్‌సింగ్' గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్

3 Jun, 2015 19:50 IST|Sakshi

హైదరాబాద్: రెండున్నర దశాబ్ధాల కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దోపిడీలు, హత్యలతో ప్రజలు, పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన గబ్బర్‌సింగ్ గ్యాంగ్ సభ్యుడొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 ఏళ్ల వయస్సులోనూ ఆ గ్యాంగ్ సభ్యుడు కొమిరె అంజయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతుండగా రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ క్రైం డీసీపీ నవీన్‌కుమార్ తెలిపారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే కొమిరె అంజయ్య అలియాస్ వడ్డె అంజయ్య(65) గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌లో పనిచేసి వయోభారం కారణంగా కొంతకాలం దోపిడీలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ రెండేళ్లుగా రాజేంద్రనగర్ ప్రాంతంలో 14 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం రాజేంద్రనగర్ ఎన్‌జీఆర్‌ఐ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని 560 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు సొత్తును దగ్గర ఉంచుకున్న బంధువులు, కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడడం ఇతని నైజం.
ఆ గ్యాంగ్‌లో మిగతావారు..?
1980 నుంచి 1990 వరకు ఎనిమిది మంది ముఠా సభ్యులు గల గబ్బర్‌సింగ్ గ్యాంగ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో దోపిడీలు, హత్యలకు పాల్పడింది. ప్రజలకు, పోలీసులకు వారి ఆగడాలు నిద్ర లేకుండా చేశాయి. కొమిరె అంజయ్య ఆ గ్యాంగ్‌లో ఒకడు. ముఠాకే చెందిన అతని సోదరుడు కొమిరె యాదయ్య, నర్సింహులు, రాములు, వేముల కిష్టయ్య, చనిపోగా వరికుప్పల కృష్ణ జైలులో ఉన్నాడు. మిగతా వారు కొమిరె చంద్రయ్య, కొమిరె జంగయ్య వృద్ధాప్యంతో బయటకు రావడం లేదు.

మరిన్ని వార్తలు