చరిత్రాత్మకం.. గద్వాల చరితం

8 Nov, 2018 19:14 IST|Sakshi

సాక్షి,గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషానికి మారుపేరుగా, కళలకు కాణాచిగా, విద్యకు పుట్టినిల్లుగా, తిరుపతి వెంకట కవులు సన్మానం పొందిన నేలగానే కాకుండా కృష్ణమ్మ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా విరాజిల్లుతోంది. నిజాం రాజ్యంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గద్వాల సంస్థానం చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని పొందింది. 1663 నుంచి 1949 వరకు 286 ఏళ్ల చరిత్ర కలిగిన గద్వాల సంస్థానం చారిత్రక నేపథ్యం ఎంతో గొప్పది. 1956 లో గద్వాల నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గద్వాల నియోజకవర్గంలో డీ.కే కుటుంబమే ఎక్కువగా పాలన సాగించింది. దివంగత సత్యారెడ్డి నుంచి మొదలైన ఈ ప్రస్థానం​ డీకే అరుణ వరకు కొనసాగుతోంది. డీ.కే సమరసింహరెడ్డి, డీ.కే భరతసింహరెడ్డి, డీ.కే అరుణ గద్వాల ఎమ్మేల్యేలుగా గెలుపొందారు. ఇక డీకే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరులు. దేశంలోనే అత్యధికంగా గద్వాల నియోజకవర్గంలోనే సీడ్‌ పత్తి పండిస్తారు. అదే విధంగా మూడు రాష్ట్రాల కూడలిగా గద్వాల రైల్వే జంక్షన్‌ కొనసాగుతోంది. చేనేతకు పుట్టినిళ్లయిన గద్వాలలో చారిత్రాత్మకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.

డీకే ఫ్యామిలీదే ఆధిక్యం
సంస్థానం కనుమరుగైన అనంతరం​ 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నగద్వాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు గద్వాల నియోజకవర్గానికి 14 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో డీకే ఫ్యామిలీ ఎవరూ పోటీ చేయలేదు. 1952లో పాగ పుల్లారెడ్డి, డాక్టర్‌ విజయమోహన్‌రెడ్డి పై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. 1957లో డీకే.సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పాగ పుల్లారెడ్డిపై గెలిచారు. 1962లో డీకే.సత్యారెడ్డి తప్పుకుని సంస్ధాన వారసుడిగా ఉన్నకృష్ణరాంభూపాల్‌ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పాగ పుల్లారెడ్డిని ఓడించారు. 1967లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన డీకే.సత్యారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా గోపాల్‌రెడ్డి గెలిచారు. 1972లో జరిగిన ఎన్నికల్లో పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి  డీకే.సత్యారెడ్డిని ఓడించారు. సత్యారెడ్డి 1978లో పాగ పుల్లారెడ్డిని ఓడించారు. సత్యారెడ్డి మరణంతో 1980లో ఉప ఎన్నిక నిర్వహించగా ఆయన కుమారుడు సమరసింహరెడ్డి కాంగ్రెస్‌(ఐ) నుంచి పోటీకి దిగి గెలిచారు. 1983లో కూడా సమరసింహరెడ్డే కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సమరసింహరెడ్డి గోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. తిరిగి కోర్టుకు వెళ్లగా రీకౌంటింగ్‌కు ఆదేశించడంతో సమరసింహరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ 1987లో తీర్పు వచ్చింది. 1989లో ​కూడా సమరసింహరెడ్డి గెలిచారు. 1994లో డీ.కే.భరతసింహరెడ్డి ఇండిపెండెంట్‌గా.. కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన తన అన్న సమరపై గెలిచారు. ఇక 1999లో తొలిసారిగా డీకే.అరుణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారి పోటీకి దిగగా టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడారు. 2004, 2009,2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగుతున్నారు. ఇలా గద్వాలలో జరిగిన ఎన్నికలన్నింట్లో డీకే ఫ్యామిలీ అడుగులు ఉండసాగాయి.

ప్రత్యర్థులూ ఆ గూటి పక్షులే...
గద్వాల ఎన్నికల్లో డీకే.సత్యారెడ్డి అనంతరం వచ్చిన డీ.కే.సమరసింహరెడ్డి, డీ.కే.భరతసింహరెడ్డి, డీకే.అరుణపై పోటీకి నిలబడుతున్న వ్యక్తులంతా డీకే బంగ్లా నుంచి వచ్చిన వారే. ప్రత్యర్థులుగా గెలిచిన వారిలో ఉప్పల గోపాల్‌రెడ్డి, గట్టు భీముడు ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి రెండుసార్లు నిలబడి ఓడిన బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కూడా డీ.కే.భరతసింహరెడ్డికి మేనల్లుడు. ఆయన కూడా బంగ్లా నుంచి వచ్చిన వారేననే చర్చ ఉంది. అదే విధంగా ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో ఉన్న గద్వాల వెంకటాద్రిరెడ్డి కూడా బంగ్లాకు చాలా కాలంగా అనుకూలంగా పనిచేశారు. నాటి కాలంలో ఎన్నికల్లో డీకే ఫ్యామిలీ​కి ఎదురుగా నిలబడిన పాగ పుల్లారెడ్డి,ఉప్పల గోపాల్‌రెడ్డి వర్గీయులెవరూ రాజకీయాల్లో లేరు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీకే ఫ్యామిలీ నుంచి వచ్చిన డీకే అరుణ(కాంగ్రెస్‌), టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి  బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, బీజేపీ నుంచి వెంకటాద్రిరెడ్డి, బిఎల్‌ఎఫ్‌ నుంచి రంజిత్‌కుమార్‌ పోటీలో ఉన్నారు.

ఐదు.. నాలుగు.. ఐదు
గద్వాల నియోజకవర్గం ప్రస్తుతం గద్వాల, కేటి దొడ్డి, మల్దకల్‌, గట్టు, ధరూరు మండలాలతో కొనసాగుతోంది. అయితే నిమోజకవర్గం ప్రారంభమైనప్పుడు గద్వాల, మల్దకల్‌, గట్టు, ధరూరుతో పాటు అయిజ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో అయిజను అలంపూర్‌లో కలిపారు. దీంతో నాలుగు మండలాలే మిగిలాయి. కాగా, తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన మండలాల పునర్విభజనలో గట్టు, ధరూరు నుంచి కొన్ని గ్రామాలను విడదీసి కేటీ దొడ్డి మండలంగా ఏర్పాటుచేశారు. దీంతో మళ్లీ గద్వాల నియోజకవర్గంలోని మండలాల సంఖ్య ఐదుకు చేరింది.

అక్షరాస్యతలోనే వెనకడుగు
జోగుళాంబ గద్వాల జిల్లా అక్షరాస్యత ప్రస్తుతం కేవలం 49.87శాతం మాత్రమే ఉంది. అంటే జిల్లా జనాభాలో కనీసం సగంమంది కూడా అక్షరాస్యులు లేరన్నమాట. ఆసియా ఖండంలోనే అక్షరాస్యతలో వెనకబడ్డ గట్టు మండలం​ గద్వాల నియోజకవర్గంలోనే ఉంది.

సాగునీరుకు ఆధారం జూరాల, నెట్టెంపాడు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి ప్రాజెక్టుగా కృష్ణా నదిపై జూరాల ప్రాజెక్టు నిర్మాణమైంది. జూరాల ప్రాజెక్టు సాగునీటితో పాటు తాగు నీటి అవసరాలను తీర్చే వరదాయనిగా మారింది. జూరాల రిజర్వాయర్‌ నుంచి మూడు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, జడ్చర్ల, వనపర్తి, గద్వాల వంటి ముఖ్య పట్టణాలే కాకుండా వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వలసల జిల్లాగా పేరుండే పాలమూరులో ఇప్పుడు సాగు పెరగడానికి జూరాల ప్రాజెక్టు ఉపయోగపడులోంది. జూరాల ప్రాజెక్టు పరిధిలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక రిజర్వాయర్‌ ద్వారా నెట్టెంపాడు ఎత్తిపోతలకు 20 టీఎంసీలను అందిస్తూ రెండు లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీల ద్వారా రెండు లక్షల ఎకరాలకు, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు ద్వారా 3.9 టీఎంసీలను అందిస్తూ దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది.

ఇదీ సంస్థాన చరిత్ర 
గద్వాల సంస్థానాధీశుల చరిత్ర 1663 నుంచి1712 మధ్య కాలంలో మొదలైంది. తొలుత సోమానాద్రి నుంచి మొదలు 1924 నుంచి 1948 చివరి వరకు మహరాణి ఆదిలక్ష్మీదేవమ్మ వరకు కొనసాగింది. గద్వాల సంస్థాన కాలంలో సంస్థానాధీశుగా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా రాణులుగా కొనసాగిన చరిత్ర ఉంది. గద్వాల  సంస్థానాధీశులుగా కొనసాగిన వారిలో 11మంది పురుషులు, ఎనిమిది మంది రాణులుగా గద్వాల సంస్థానాన్నిపరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. తిరుపతి వెంకట కవులే కాకుండా ఎందరో వేద పండితులకు సత్కారాలు చేయడంతో గద్వాలకు విద్వత్‌ గద్వాలగా పేరు వచ్చింది. ఆనాటి  గద్వాల  సంస్థానాధీశుల ఏలుబడి నుంచి ప్రజాస్వామ్యంలో అడుగిడిన గద్వాలలో తొలిసారిగా 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఎన్నికలు జరిగాయి.  

మూడు రాష్ట్రాల కూడలిగా రైల్వే జంక్షన్‌
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చడం ద్వారా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పశ్చిమలను కలిపేలా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. నిజాం రైల్వేగా అవతరించిన నాడే గద్వాల  సంస్థానాధీశులు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గద్వాల రైల్వే జంక్షన్‌ ఏర్పాటుకు 105 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ రైల్వేలో విలీనం కాగా రాయచూర్‌-రాయచూర్‌ రైల్వే లైన్‌ ఎన్నికల ప్రచార అంశంగా మారింది.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర మంత్రిగా పనిచేసిన మల్లికార్జున్‌ తనకాలంలో రాయచూర్‌-మాచర్ల రైల్వే లైన్‌ను దశలు విభజించి గద్వాల-రాయచూర్‌ మధ్య మొదటి దశగా మంజూరు ఇప్పించారు. అనంతరం 11ఆగష్టు 2002 న అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహయమంత్రి బండారు దత్తాత్రేయ  గద్వాల-రాయచూర్‌ లైన్‌కు శంకుస్థాపన చేశారు. 12 అక్టోబర్‌2013న అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్‌ కార్గే కొత్త లైన్‌ను ప్రారంభించారు. గద్వాలలో అప్పటి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, స్థానిక ఎంపీ మందా జగన్నాథం కొత్త రైలుకు స్వాగతం పలికారు. నాటి నుంచి రైల్వే జంక్షన్‌గా గద్వాల రైల్వే స్టేషన్‌ ప్రారంభమైంది. 2014జూన్‌ 2 నుంచి తెలంగాణ ఏర్పాటు కావడంతో మూడు రాష్ట్రాల రైల్వే కైడలిగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు రైల్వే జంక్షన్‌గా ఉన్న గద్వాల స్టేషన్‌ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చెందింది. గద్వాల నియోజకవర్గానికి ఇదో విశేషంగా చెప్పవచ్చు. 

జిల్లాలో ఇతర రంగాలు 
గద్వాల నియోజకవర్గంలో  జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులు, రిజర్యాయర్లు, చెరువులు ఉండటం వల్ల మత్య్స సంపదకు అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే 25శాతం పత్తి విత్తనోత్పత్తి చేయడం విశేషం. చేనేతకు దేశంలోనే ప్రసిద్ధి. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అనువైన ప్రాంతంగా గట్టు మండలం ఈ నియోజకవర్గంలో ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు

తప్పుడు సర్వేలను  పాతరేశారు: ఈటల

ప్రజలు మనవైపే

సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?