దిగుబడిని చూసి వారు ఓర్వలేకపోతున్నారు

30 Apr, 2020 16:03 IST|Sakshi

సాక్షి, కరీంనగర్:  ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పౌరసరఫరాల మంత్ర గంగుల కమాలాకర్‌ మండిపడ్డారు. కొత్తపల్లిలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి  ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు పంట రాలేదని,  కొనుగోళ్లు కూడా గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. కాళేశ్వరం జలాలు, 24 గంటల కరెంట్ వల్లే పంట దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సగటున రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు కోనుగోలు చేస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల మంది రైతులు ఇప్పటి వరకు తమ పంటను అమ్ముకున్నారని, రాష్ట్రంలో ఉన్న 6540 కోనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 5789 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, భారీ ఎత్తున పంట దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉండటం ప్రతిపక్ష పార్టీలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఇంత పంట దిగుబడి చూసి ఓర్వలేకే ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. (రేషన్‌ కార్డులేని వారికి పోస్టల్‌ ద్వారా రూ.1,500)

రైతులు సాగునీటి కోసం, కరెంట్ కోసం ఇబ్బందులు పడినప్పుడు విమర్శులు చేస్తున్న నేతలంతా ఎక్కడికెళ్లారని, రైతులు పంటను కాల్చుతుంటే నవ్వుతున్న వాళ్లు ఇంతకాలం రైతుల కోసం ఎందుకు పోరాటం చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలకు, 24 గంటల కరెంటుకు అడ్డుపడిన నేతలే ఇప్పుడు మళ్లీ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. నారు, నీరు పోయని కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దని, నారు, నీరు పోసి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతులు నమ్మాలని సూచించారు.  గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం కొనకపోతే రూ. 800లకు క్వింటా వడ్లు అమ్ముకుంటున్నారని, దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనడం లేద చెప్పారు. ఏనాడు రైతుల గురించి ఆలోచించని నాయకులు కార్లేసుకుని వచ్చి కల్లాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇక  రైసు మిల్లులకు, రైతులకు సంబంధం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే రైతులు రావాలన్నారు. (శభాష్‌ కమలాకర్‌ అంటూ అభినందించిన సీఎం)  

పాడీ క్లీనింగ్ చేసి తీసుకువచ్చిన తర్వాత కూడా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలని మంత్రి రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే తాలు నిబంధనలు అమలు చేస్తుందని,  బీజేపీ నేతలకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేసి తెలంగాణలోని రైతులకు ధాన్యం సేకరణ నిబంధనలు సడలించేలా చూడాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రోత్సాహంతోనే కొంతమంది రైతులు తూర్పార బట్టిన తాలును మాత్రమే తగలబెట్టారని పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకి ఈసారి కోటీ 20 లక్షల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. ఇదంతా చూసి ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని,  మీ కళ్ల మంటలే మాకు దీవెనలు అని హితవు పలికారు. కరోనా ప్రభావం రైతులపై పడకుండా ఉండేందుకు ఊరుకో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని వెల్లడించారు. సన్నరకం ధాన్యం పండించాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని, ఈ విషయంలో రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు