ఒరాకిల్‌ నుంచి స‘రాగాల’ దాకా...

27 Feb, 2020 11:36 IST|Sakshi

ఈ సిటీలో కవులు, శ్రోతలు ది బెస్ట్‌

హైదరాబాదీ పొయెట్రీ విశ్వవ్యాప్తం చేస్తా

సాక్షితో  గజల్‌–సూఫీగాయని స్మితబెల్లూర్‌ 

సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం.. ఐదంకెల జీతం.. అయినా ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. సంగీతంపైనే మనసు మళ్లింది. పదేళ్లపాటు ఉద్యోగం చేస్తూనే వీకెండ్‌లో సంగీత ప్రదర్శనలిచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తరువాత ఆమెకు జాబ్‌ బోర్‌ కొట్టేసింది.సంగీతమే తన ప్రపంచం అనుకుంది.  ఉద్యోగం మానేసి సంగీతప్రదర్శనలకేఅంకితమైంది. ఆమే ముంబైకు చెందినసూఫీ గాయని స్మిత బెల్లూర్‌. తాజాగానగరంలోని ఆషియాన గార్డెన్స్‌లో ప్రదర్శన ఇచ్చారు. ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగాముచ్చటించారు.

సాక్షి, సిటీబ్యూరో: నిజామ్‌ కాలంలో గజల్, సూఫీ సంగీతానికి నగరం కేంద్రంగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే. ఆధునిక సంగీతపు ప్రవాహంలో ఆ అలనాటి సంగీతపు విశేషాలు అంతగా వినిపించనప్పటికీ... ఇప్పటికీ సంపన్నుల, సంప్రదాయ హైదరాబాదీల వేడుకల్లో గజల్‌ సవ్వడులు, çసూఫీ రాగాలు వీనుల విందు చేస్తూనే ఉంటాయి. అలాంటి వేడుకల కోసం ప్రముఖ గాయనీ గాయకులు నగరానికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అదే క్రమంలో నగరానికి వచ్చిన  స్మిత బెల్లూర్‌ పంచుకున్న  విశేషాలు ఆమె మాటల్లోనే...

ఒరాకిల్‌నుంచిస‘రాగాల’దాకా...
జన్మతః కర్నాటకవాసిని. బెంగుళూర్‌లో పుట్టాను. మా తల్లిదండ్రులకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి సంప్రదాయ సంగీతంనేర్చుకుంటూ వచ్చా. ఇంజనీరింగ్‌ చదువైపోయాక ఉద్యోగంలో చేరాను. ఒరాకిల్‌లో పదేళ్లు పనిచేశాను. అదే సమయంలో ఉద్యోగంలో సరిపడా తృప్తి లభించక హాబీగానూ కచేరీలు ఇచ్చేదాన్ని. వీకెండ్‌లో శుక్రవారం సాయంత్రం అన్నీ ప్యాక్‌ చేసుకుని వెళ్లిపోయి కన్సర్ట్‌ అయిపోయాక సోమవారం ఆఫీస్‌కి తిరిగొచ్చేదాన్ని. సూఫీ గాయకుల్లో మహిళలు చాలా తక్కువనేది నిజమే. నా అదృష్టం కొద్దీ దేశంలోనే అగ్రగామి సూఫీ గాయకులు వార్సీ బ్రదర్స్‌ దగ్గర శిష్యరికం నన్ను గాయనిగా తీర్చిదిద్దింది. మా అమ్మాయి పుట్టి స్కూల్‌ ఏజ్‌ వచ్చాక... ఇక ఉద్యోగం చేయడానికి మనస్కరించలేదు. సంగీతానికి పూర్తిగా అంకితమయ్యాను. 

అన్నింట్లో... సిటీ మేటి...
ఈ నగరంలో ఆషియాన గార్డెన్స్‌లో షామ్‌ ఎ గజల్‌ లో పొల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. నా అభిమాన కవులు పుట్టిన ఈ సిటీకి రావడం అంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. హైదరాబాదీ ఆడియన్స్‌ కూడా గొప్ప శ్రోతలు. మంచి పొయెట్రీ వినడానికి బాగా ఇష్టపడతారు. రాత్రి 9గంటలకు మొదలుపెడితే ఒక్కోసారి తెల్లవారే దాకా కూడా అలా వింటూ ఉండిపోతారు. వాళ్లు నన్ను ఆలపించమని కోరే గీతాలు, చాలా సునిశితంగా ప్రతి పదం వినడం,. పొరపాటున తప్పు పాడితే కనిపెట్టేయగలగడం అబ్బురమనిపిస్తాయి. నా వరకూ ఈ తరహా సంగీత వేదికల విషయంలో ఈ సిటీ దేశంలోనే బెస్ట్‌ ప్లేస్‌.  

సిటీ కవిత్వం.. విశ్వవ్యాప్తం కావాలి...
ఈ నగరానికి చాలా సార్లు వచ్చాను. ఇక్కడ కవులతో పాటు మరెందరో కళాకారులున్నారు. నేనెప్పుడూ పాడడానికి నా బృందంతో ఇక్కడికి రాను.  నా కార్యక్రమాల్లో తబలా పలికించే సర్ధార్‌ ఖాన్‌ , హోర్మోనియం ప్లే చేసే యాకుబ్‌ అలీ , కీబోర్డ్‌ ని కదిలించే రాజు , గిటారిస్ట్‌ ఫ్రాన్సిస్,హరిజీత్‌ సింగ్‌... వీళ్లందరూ హైదరాబాదీలే. ఈ నగరం చారిత్రకంగా, సాహిత్యపరంగా సుసంపన్నం. ఇక్కడ  మోజమ్‌ షాజీ, లాస్ట్‌ నిజామ్, అంజాద్‌ హైదరాబాదీ, షఫీ హైదరాబాదీ...అద్భుతమైన, నిగూఢమైన అర్ధాలు ఉన్న కవిత్వం వారిది.  హైదరాబాదీ పొయెట్స్‌కి సంబంధించిన కవిత్వాన్ని మరింత లోతుకు వెళ్లి పరిశోధించే ప్రాజెక్ట్‌ చేపట్టాను. దీనిని  ప్రపంచమంతా తీసుకెళ్లాలని ఆకాంక్ష.  

భక్త‘మహిళ’లపై కొత్త ప్రాజెక్టు...
వుమెన్‌ మిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ ద సబ్‌కాంటినెంట్‌ పేరుతో మరో ప్రాజెక్ట్‌ కూడా చేపడుతున్నా.  మన దేశంలో దేవుడితో మహిళకు అనుబంధం విభిన్న రూపాల్లో ఉంటుంది.  దేవుడ్ని భర్త, స్నేహితుడు, బిడ్డ... ఇలా చూసిన ఎందరో మహిళలు అద్భుతమైన కీర్తనలు ఆలపించారు. వీరిలో ఆండాళ్, మీరాబాయి, అక్క మహాదేవి ఇలా ఎందరో. మహిళలకు ఏ రకమైన ప్రోత్సాహం లేని సమయాల్లో కూడా వీళ్లు తమదైన అస్తిత్వాన్ని ప్రదర్శించారు. వీరి గురించి నా కొత్త ప్రాజెక్టు ద్వారా వివరించనున్నా. ఇక సినిమా పాటల విషయానికి వస్తే... తెలుగు సినిమాతో స్వల్ప పరిచయం ఉంది. హార్ట ఎటాక్‌ అనే చిత్రంలో ఆలాపన పాడాను. మంచి అవకాశాలు వస్తే సినిమాలకు పాడడానికి సిద్ధమే.

మరిన్ని వార్తలు