దేశవ్యాప్తంగా మిషన్‌ ‘భగీరథ’

12 Nov, 2019 03:05 IST|Sakshi
సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ 

రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా దేశవ్యాప్తంగా పథకం అమలుకు యోచన

కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడి

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ..

మిషన్‌ భగీరథపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన కేసీఆర్‌

భగీరథ పథకం, దాని నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని వినతి  

సాక్షి, హైదరాబాద్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నదని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని (సీవరేజ్‌) ట్రీట్‌ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతిభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథపథకం గురించి షెకావత్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ స్వరూపాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఆర్థిక సహకారం ఇవ్వండి..
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ‘తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచినీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్‌ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకక పోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఇదే సమయంలో ‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తోంది. కాబట్టి మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. 11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు