గజ్వేల్ అభివృద్ధే లక్ష్యం

2 Nov, 2014 01:51 IST|Sakshi

గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్‌బొజ్జా పిలుపునిచ్చారు. శనివారం రాత్రి గజ్వేలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ హోదాలో వివిధశాఖల జిల్లా అధికారులు, స్థానిక అధికారులతో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే ఫలాలు అందించటంతోపాటు అభివృద్దిని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు.

ఈ సందర్భంగా శాఖల వారీగా పలు సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పీహెచ్‌సీల్లో సాధారణ డెలివరీల సంఖ్య అతి తక్కువగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారులు, గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బంది సరైన శ్రద్దను ప్రదర్శించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో సమస్యలను తీర్చడానికి సిద్దంగా ఉన్నామని, డెలివరీల సంఖ్య పెంచి గ్రామీణ పేద మహిళలకు మేలు చేయాలని సూచించారు. వ్యవసాయాశాఖకు సంబంధించి రుణాల రీషెడ్యుల్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

గ్రామాల్లో అపరిశుద్ధ్యాన్ని పారదోలడానికి డంప్ యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఇందుకోసం గ్రామాలవారీగా అర ఎకరంనుంచి ఎకరం వరకు సేకరించాలని ఆదేశించారు. అదేవిధంగా  పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై దృష్టిసారించాలన్నారు. ప్రతి పంచాయతీలో పన్నుల వసూలు శాతాన్ని 50కి పెంచాలని చెప్పారు.  నియోజకర్గంలో దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చేపట్టిన ల్యాండ్ పర్చేజ్ స్కీమ్‌ను వేగవంతం చేయాలన్నారు.

అదేవిధంగా నియోజకవర్గంలో నీటిపారుదల, ఉద్యానవనం, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పశుసంవర్ధకశాఖ, ఐసీడీఎస్, సూక్ష్మనీటి పథకం తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు. ఇంకా ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ హుక్యానాయక్, ఉద్యావనశాఖ ఏడీ రామలక్ష్మీ, డీపీఓ  ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు