రూటు మారిన పైప్‌లైన్

23 May, 2015 23:58 IST|Sakshi

గజ్వేల్ మంచినీటి పథకం డిజైన్‌లో మార్పులు
 
 గజ్వేల్ పట్టణానికి మంచి నీటిని అందించే పథకం పలు మలుపులు తిరుగుతోంది. ఇటీవల మార్చిన డిజైన్‌ను తాజాగా మరోమారు సవరించారు. ఈసారి చేసిన భారీ మార్పులతో గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తానికి తాగునీరు అందనుంది. నీటి పథకం.. వాటర్‌గ్రిడ్ పరిధిలోకి వెళ్లనుంది.
 - గజ్వేల్
 
 ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న గజ్వేల్ మంచినీటి పథకం డిజైన్ మారింది. గోదావరి సుజల స్రవంతి పథకం నుంచి నీటిని ట్యాపింగ్ చేయాలనే ఆలోచనకు స్వస్తి పలికారు. అలాచేస్తే నీటి సరఫరా సక్రమంగా సాగదని భావిస్తున్నారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న భారీ సంప్ నుంచే నీటి పైప్‌లైన్ ద్వారా.. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ సమీపంలోని జబ్బాపూర్ అడవుల్లోకి తెస్తారు. అక్కడ భారీ జీఎల్‌బీఆర్, ఓహెచ్‌బీఆర్‌లను నిర్మించి గ్రావిటీ ద్వారా గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరందించాలనే ఆలోచనతో ఉన్నారు.

గజ్వేల్ నగర పంచాయతీలో నెలకొన్న మంచినీటి సమస్యకు తెరదించేందుకు సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకురావాలని తొలుత భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ.200 కోట్లు అవసరమని అం చనా వేశారు. సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీ రు తేవడం వ్యయభారమే కాకుండా ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్లాది రూపాయల కరెంట్ బిల్లులను భరించాల్సి వస్తుందని గుర్తించారు.

 ‘సాక్షి’ వరుస కథనాలతో మార్పులు
 ఈ ప్రాంతం నుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్‌లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకం నీటిని మళ్లిస్తే.. సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’  కథనాలు ప్రచురించింది. ఈ విషయం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది. ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు అందడంతో ‘గోదావరి’ పథకానికి అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్‌లైన్ ద్వారా తీసుకురానున్నారు.

తొలుత శామీర్‌పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్‌ను ట్యాప్ చేయాలని భావించారు. లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్‌లైన్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుందని తాజాగా యోచిస్తున్నారు. ఆ తర్వాత లింగారెడ్డిపేట పైప్‌లైన్ ట్యాపింగ్‌తోపాటు  నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ, భూముల సేకరణ తదితర పనుల కోసం రూ.60 కోట్లు ప్రతిపాదించారు. వీటికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

ఈ మేరకు గతేడాది నవంబర్‌లో నగర పంచాయతీ పాలకవర్గం సమావేశమై పనులకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. కానీ లింగరాజ్‌పేట వద్ద ట్యాపింగ్ చేస్తే ప్రెషర్ సరిపోక గజ్వేల్‌కు గ్రావిటీ ద్వారా నీటిని అందించడం కష్టమవుతుందని గోదావరి పథకం నిపుణులు సూచించారు. వారి సూచన మేరకు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

 తాజా మార్పులు ఇలా...
 కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న భారీ సంప్ నుంచే పైప్‌లైన్ ద్వారా నీటిని ఎత్తయిన ప్రదేశంలో ఉన్న జబ్బాపూర్ అడవుల్లోకి తేనున్నారు. అక్కడ భారీ జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మించి గ్రావిటీ ద్వారా గజ్వేల్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరందిస్తారు. ఈ పనులను ‘వాటర్‌గ్రిడ్’లో చేర్చనున్నారు.

గజ్వేల్ మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంకు నుంచి మంజూరైన రూ.60 కోట్లను పట్టణంలోని సంప్‌ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ పనులకు వినియోగించనున్నారు. అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లి నుంచి కోమటిబండ వరకు చేపట్టే పైప్‌లైన్ పనులకు ‘వాటర్‌గ్రిడ్’ నిధులను వినియోగించనున్నారు. మంచినీటి పథకం మార్పుల విషయాన్ని గజ్వేల్ ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ రాజయ్య ‘సాక్షి’కి ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు