గజ్వేల్‌కు మహర్దశ!

26 May, 2014 23:39 IST|Sakshi

నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం, ఇందిరాపార్క్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు గత కొంత కాలంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి  సంత జరిగే బుధవారం నాడు ప్రధాన రహదారిపై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ మార్గం గుండానే భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.

ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న మెతుకుసీమ గర్జన పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలోనూ ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ స్వయంగా అనుభవించారు. ఆయన వాహన శ్రేణిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకు సీమగర్జన సభలో  ట్రాఫిక్ సమస్యను  ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  

ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులకు పనులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్, సిద్దిపేట ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ శాఖ డిప్యూటీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు సోమవారం పట్టణంలో సర్వే చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం పట్టణంలోని 133/33కేవీ సబ్‌స్టేషన్‌నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్‌టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్‌కళశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు  రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో నగరపంచాయతీ పరిధిలోని క్యాసారంలో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముఖ్యనేతలు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్ టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆకుల దేవేందర్ తదితరులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు.  మొత్తానికి గజ్వేల్‌లో రింగ్‌రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు