ఇప్పటికి ఇంతే!

14 Dec, 2014 02:29 IST|Sakshi
ఇప్పటికి ఇంతే!

* ఇందూరుకు రెండో మంత్రి లేనట్లే
* ప్రభుత్వ విప్‌గా గంప గోవర్ధన్‌కు ఛాన్స్
* ఫలించని రవీందర్‌రెడ్డి ప్రయత్నాలు
* పార్టీ శ్రేణుల అంచనాలు తారుమారు
* ఇక చైర్మన్ల రేసులో శాసనసభ్యులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గులాబీ దళపతి కేసీఆర్ కేబినేట్‌లో రెండో మంత్రిగా జిల్లాలో ఎవరికీ అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంతో పలువురు శాసనసభ్యులు ముమ్మర ప్ర యత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గంలో కొలువుదీరే రెండో మంత్రి ఎవరు? అన్న అంశం సర్వత్రా ఉత్కంఠ రేపింది. 16వ తేదీన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయడం, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో మరో మంత్రి పదవికి ఛాన్స్ లేదని తేలుతోంది. జిల్లాలో మొత్తంగా రెండు ఎంపీ స్థానాలు, తొమ్మిది శాసనసభ స్థానాలను గెలుచుకున్నందున జిల్లా నుంచి కనీసం ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని భావించారు. రెండో దఫా జరిగే విస్తరణలో ఆ అవకాశం ఉంటుందనుకున్నారు. చివరికి కేసీఆర్ విప్ పదవితో సరిపెట్టారు.
 
సామాజిక కోణంలో ‘గంప’కు దక్కిన పదవి
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న ఎల్లారెడ్డి శాసనసభ్యుడు ఏనుగు రవీందర్‌రెడ్డి మం త్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం సందర్భంగా 11 మంది మంత్రులయ్యారు. జిల్లా నుంచి నలుగురైదుగురు ప్రయత్నం చేసినా, పోచా రం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత రెండోసారి విస్తరణ జరనుందన్న ప్రచారం జరిగినపుడు ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్,బిగాల గణేశ్ గుప్తా పేర్లు ప్రధానంగా వినిపించాయి.

ఇతర జిల్లాల ప్రాధాన్యాలు, సామాజిక, రాజకీయ కోణాలు, సీనియారిటీయే ప్రామాణికమన్న ప్రచారం కూడా పార్టీలో కొనసాగింది. ఈ సారి విస్తరణలో ఆరుగురు మంత్రులను కేబినేట్‌లోకి తీసుకుంటుండగా, మొదట మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల తర్వాత మన జిల్లా ప్రస్తావన ఉండవచ్చని కూడా పార్టీవర్గాలు ఊహించాయి.రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి, గణేశ్‌గుప్తా, గంప గోవర్ధన్‌లలో ఎవరైనా ఒకరికి మంత్రి పదవి రావచ్చనుకున్నారు. ‘విప్’గా అవకాశం కల్పిస్తే బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బిగాల, గంప గోవర్ధన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరకు గంప గోవర్ధన్‌కు ‘విప్’ పదవి దక్కింది.
 
మరో పదవి వస్తుందా!

మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రభుత్వం ఐదారుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా, ఐదారుగురు ఎమ్మెల్యేలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి, విప్ పదవుల కోసం ప్రయత్నం చేసి విఫలమైన ఎమ్మెల్యేలు చైర్మన్ పదవులపై దృష్టి సారించి, తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తాతోపాటు ఆర్మూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి,హన్మంత్ సింధే సైతం ఏదైనా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. ఇక ఎవరికి పార్లమెంట్ సెక్రెటరీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కుతాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు