తిరుగులేని నేత

13 Dec, 2018 10:13 IST|Sakshi
విజయ సంకేతం చూపుతోన్న గంప గోవర్ధన్‌

ఐదోసారి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్‌

కామారెడ్డిలో ఓటమి లేని నాయకుడు

ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు

పథకాల అమలులో తనదైన ముద్ర

కామారెడ్డి క్రైం: అభివృద్ధి, సంక్షేమానికే కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. సొంత నియోజకవర్గంలో ఓటమి లేకుండా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌ తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపును పొందారు. ఎమ్మెల్యే గా గెలిచిన ప్రతిసారి సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేసుకున్నారు. తద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ బలమైన కేడర్‌ను, పట్టును సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైనే ప్రజల్లోకి వెళ్లారు. అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వంతో పాటు c అవకాశం ఇచ్చారు.  

ఐదోసారి ఎమ్మెల్యేగా.. 
భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన గంపగోవర్ధన్‌ 1987లో సింగిల్‌విండో చైర్మన్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 1999లో యూసుఫ్‌అలీకి, 2004లో టీడీపీతో పొత్తులో భాగంగా కామారెడ్డి స్థానం బీజేపీకి దక్కడంతో గంపగోవర్ధన్‌ పోటీ చేయలేదు. ఈ కాలంలో ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 

2009లో 2వ సారి టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంగా టీడీపీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి 2011లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 4వ సారి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌ ప్రభుత్వవిప్‌ అయ్యారు. 2018 ఎన్నికల్లో 5వ సారి కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి తిరుగులేని నేతగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

షబ్బీర్‌అలీపై పైచేయి
గంపగోవర్ధన్‌కు తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలో ఇప్పటి వరకు ఓటమి లేదు. 2004లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగం గా కామారెడ్డి స్థానం బీజేపీకి కేటాయించారు. దీంతో గంపగోవర్ధన్‌ పక్క నియోజకవర్గమైన ఎల్లారెడ్డి నుంచి టీడీపీ టిక్కెట్‌ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. దీనిని మినహాయిస్తే ఆయనకు తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలో మాత్రం ఓటమి ఎదురుకాలేదు. పోటీ చేసిన ప్రతిసారి విజయం వరించింది. చిరకాల ప్రత్యర్థులైన గంపగోవర్ధన్, షబ్బీర్‌అలీల మధ్యే నాలుగుసార్లు ప్రధానపోటీ నెలకొంది. నాలుగుసార్లు గంపగోవర్ధన్‌దే పైచేయి అయింది. నాలుగుసార్లు షబ్బీర్‌అలీపై, 2012 ఉప ఎన్నికల్లో ఎడ్లరాజిరెడ్డి పై ఆయన గెలిచారు. బలమైన క్యాడర్‌తో పాటు నియోజకవర్గంలో అత్యంత ప్రజాధారణ కలిగిన నేతగా జిల్లాస్థాయిలో గుర్తింపును సాధించారు.  

మరిన్ని వార్తలు