గంప నారాజ్‌!

9 Sep, 2019 10:05 IST|Sakshi
గంప గోవర్ధన్‌

కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమన్నదే ఎరుగని రికార్డు సొంతం చేసుకున్న సీనియర్‌ నేత గంప గోవర్ధన్‌కు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికార పార్టీ సభ్యుడైనా.. ‘విప్‌’ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన నారాజ్‌ అయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు గెలుపును దూరం చేసిన తమ నేతకు అమాత్యయోగం దక్కకపోవడంతో ఆయన అనుచరులూ నిరాశచెందుతున్నారు.

సాక్షి, కామారెడ్డి: వరుస విజయాలతో జోరు మీదున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ విప్‌ పదవితోనే సరిపెట్టడంతో ఆయన నిరాశచెందుతున్నారు. గంప గోవర్ధన్‌ కామారెడ్డి నియోజక వర్గంలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీని పలుమార్లు ఓడించారు. 1994లో తొలిసారి కామారెడ్డి నియోజకవర్గంనుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకుని ఎమ్మెల్యే అయ్యారు. 1999 ఎన్నికల్లో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొంత నిరాశ చెందారు. 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్టు ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ ఆయన షబ్బీర్‌ అలీపై గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ప్రభుత్వం విప్‌ పదవితోనే సరిపెట్టింది. ఆయన ఐదేళ్లపాటు విప్‌గా పనిచేశారు. 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందని గంప ఆశలుపెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పలుమార్లు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని విన్నవించినట్లు సమాచారం. ఈసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీం తో మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని గంప ఆశించారు. అయితే ప్రభుత్వం ఆయనను రెండోసారీ నిరాశకు గురిచేసింది. విప్‌ పదవితోనే సరిపెట్టింది.

దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కొంత ముభావంగా కనిపించారు. ఆదివారం భిక్కనూరు మండలంతో పాటు కామారెడ్డి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండోసారి ప్రభుత్వ విప్‌ పదవి రావడంతో ఆయన అనుచరులు అభినందించడానికి రాగా.. సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అమాత్యయోగం రాలేదన్న బాధలో ఉన్న ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి వెను దిరిగారే తప్ప ఎక్కడా స్పీచ్‌లు కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సన్మానాలను కూడా ఆయన తిరస్కరించారు. ఎమ్మెల్యే నారాజ్‌లో ఉన్నాడని తెలిసిన ఆయన అనుచరులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. సాయంత్రానికి గోవర్ధన్‌ హైదరాబాద్‌ తిరిగి వెళ్లారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా