భద్రకాళి చెరువులో గణపతి

4 May, 2018 02:20 IST|Sakshi

జలగర్భంలో 13 వందల ఏళ్లు

మూడు రోజుల క్రితం వెలుగులోకి..

కాకతీయుల కంటే పూర్వ కాలానివి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌లో అరుదైన శిల్పాలు లభ్యమయ్యాయి. ప్రసిద్ధి చెందిన భద్రకాళి చెరువులో సుమారు 1,300 ఏళ్ల నాటి గణపతి, శివలింగంతోపాటు మరికొన్ని శిల్పాలు బయల్పడ్డాయి. కాకతీయుల కాలం కంటే పూర్వం నాటి గణపతి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. వరంగల్‌ నగర మంచినీటి చెరువుగా భద్రకాళిని ఉపయోగిస్తున్నారు. లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ నుంచి నీటిని ఇక్కడకు పంపింగ్‌ చేస్తారు. దీంతో ఏడాది పొడవునా భద్రకాళి చెరువులో నీరు ఉంటుంది.

రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత హృదయ్‌ పథకంలో భాగంగా భద్రకాళి చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా ఫోర్‌షోర్‌ బండ్‌లో రోడ్డు నిర్మించడంతో పాటు చెరువులో పూడిక తీస్తున్నారు. ఈ నేప థ్యంలో ఏడాది కాలంగా చెరువును పూర్తిగా నింపడం లేదు. దీంతో చెరువు మధ్యలో ఉన్న బండరాళ్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా భద్రకాళి చెరువు సరిహద్దుగా ఉండే సిద్ధులగుట్ట వద్ద పరిశోధనలు చేస్తుండగా ఏడో శతాబ్దానికి చెందిన విగ్రహాలు వెలుగు చూశాయి.

చరిత్ర క్రమంలో..
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ హరగోపాల్‌ ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకులు ఐదు రోజుల క్రితం సిద్ధులగుట్ట దిగువన ఉన్న భద్రకాళి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ రెండు పెద్ద బండరాళ్లు కనిపించాయి. వీటిలో పైన ఉన్న బండరాయిపై వికసిత పద్మంలో కూర్చున్న వినాయకుడి విగ్రహం ఉంది. ఈ వినాయక విగ్రహం ఐదు అడుగుల ఎత్తుతో ఉంది. ఈ విగ్రహం కింది మరో బండరాయి ఉంది. దీనిపై శివలింగం, నంది, వినాయకుడు, సూర్యుడు, మహిషాసురమర్ధిని, విష్ణు శిల్పాలు ఉన్నాయి.

ఈ రెండు బండరాళ్లపై ఉన్న శిల్పాలు సాధారణ హైందవ సంస్కృతికి కొంత భిన్నంగా ఉన్నాయి. లింగం ఆకారంలో ఉన్న శిల్పం కింద పానవట్టం స్తూప వేదిక తరహాలో ఉంది. స్తూప వేదికలను అనుసరించే పద్ధతి బౌద్ధంలో ఉంది. సాధారణంగా వినాయక విగ్రహాలు పరిశీలిస్తే ఒక చేతిలో ఉండ్రాళ్లు, మరో చేతితో దీవిస్తున్నట్లుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వినాయక శిల్పాల్లో రెండు చేతులు నాభికి దగ్గరగా ఉన్నాయి. ఇటువంటి విగ్రహాలు జఫర్‌గఢ్‌ గుట్ట, ఆలేరు సమీపంలోని రఘునాథపురం దేవాలయంలో ఉన్నాయి.

వినాయక విగ్రహం వికసించిన పద్మంపై చెక్కిన విధానం జైన మత ఆనవాళ్లను చూపుతోంది. బహుశా ఈ రెండు శిల్పాలు ఇతర మతాలకు చెందినవై ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. ఏడో శతాబ్దంలో బౌద్ధ, జైన, హైందవ మతాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఆధిపత్యం చెలాయించిన మతం ఇతర మతాల శిల్పాలను క్రమంగా తమ మతానికి అనుగుణంగా మార్పులు చేసే వారు. ఆ క్రమంలో మార్పు చెందిన విగ్రహాలే ప్రస్తుతం భద్రకాళి చెరువులో వెలుగు చూశాయని చరిత్రకారులు భావిస్తున్నారు.

దీన్ని బలపరిచేలా కాకతీయులకు పూర్వం హన్మ కొండ నగరం కేంద్రంగా జైన, బౌద్ధ మతాలు వర్ధిల్లాయి. దీన్ని బలపరిచేలా బౌద్ధ, జైన సాహిత్యం, శాసనాల్లో అర్హతులకొండ, అర్మకుండం, అమ్ము కుండె పేర్లు హన్మకొండకు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో కాకతీయులు ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించి శైవ మతాన్ని అవలంబించారు. ఈ క్రమంలో బౌద్ధ, జైన మతాలు కనుమరుగై శైవం పుంజుకుంది. సుమారు వెయ్యేళ్లకు పైగా జలగర్భంలో ఉండిపోయిన ఈ శిల్పాలపై పురావస్తుశాఖ పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు