కోవిడ్‌ రోగులకు కోరుకున్న ఆహారం..

9 Apr, 2020 08:29 IST|Sakshi

కోవిడ్‌ రోగులకు మందులతో పాటు మనోస్థైర్యాన్నీ అందిస్తున్నాం

గాంధీలో ఇప్పటి వరకు 310కిపైగా పాజిటివ్‌ కేసులకు చికిత్స

వీరిలో 20 మంది 12 ఏళ్లలోపు పిల్లలు.. ఇప్పటికే 27 మంది డిశ్చార్జి

సాధారణ చికిత్సలతోనే 80 శాతం మందికి ఆరోగ్యం మెరుగు  

ఐసీయూ, కరోనా పాజిటివ్‌ ఐసోలేషన్‌ వార్డుల్లో ప్రస్తుతం 280 మంది

ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 200 మంది అనుమానితులు    

15 శాతం మందిలోనే తీవ్ర లక్షణాలు..

కేవలం రెండు శాతం మందికే వెంటిలేటర్‌ చికిత్స

గాంధీ కరోనా నోడల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ రాజారావు

సాక్షి, సిటీబ్యూరో/గాంధీఆస్పత్రి: కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరిన బాధితులను వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. వీరు త్వరగా కోలుకునేందుకు మందులతో పాటు మనోస్థైర్యాన్నీ కల్పిస్తున్నాం. ఆస్పత్రికి వస్తున్న చాలా మందిలో దగ్గు, జ్వరం, జలుబు వంటి సాధారణ లక్షణాలేకన్పిస్తున్నాయి. 15 నుంచి 20 శాతం మందిలో మాత్రమే తీవ్ర లక్షణాలు వెలుగుచూస్తున్నాయి. వీరిలో కేవలం 5 శాతం మందికే ఐసీయూ చికిత్సలు అవసరం అవుతుండగా, వీరిలో 2 శాతం మందికే వెంటిలేటర్‌ చికిత్సలు అందజేస్తున్నాం. కొంతమంది కోలుకుంటుండగా మరికొంత మంది మృతి చెందుతున్నారు. 80 శాతం మంది సాధారణ చికిత్సలతోనే కోలుకుంటున్నారు. కేవలం 15 నుంచి 20 శాతం మందికే ప్రొటోకాల్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమవుతుంది’ అని గాంధీ కరోనా నోడల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే...

గాంధీ కరోనా నోడల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ రాజారావు
గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిస్థాయి కరోనా నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఐసీయూలో 500 పడకలు, ఐసోలేషన్‌ వార్డుల్లో 1000 పడకలను సమకూర్చాం. జనరల్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నాం. మార్చి 2న ఇక్కడ తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇలా ఇప్పటి వరకు 310 మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 ఏళ్లలోపు పిల్లలు 20 మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటికే పూర్తిగా కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారు 27 మంది ఉన్నారు. ఐసీయూ, కరోనా పాజిటివ్‌ ఐసోలేషన్‌ వార్డుల్లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతుండగా, ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 200 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. 

చికిత్సలు మూడు కేటగిరీలుగా..  
ఆస్పత్రికి వచ్చిన కేసులను మూడు రకాలుగా విభజిస్తున్నాం. వీటిలో అనుమానితులను కేటగిరీ–1గా, విదేశీ ట్రావెల్‌ హిస్టరీ ఉన్న వాటిని కేటగిరీ–2, మర్కజ్‌ లింక్‌ ఉన్న కేసులు, పాజిటివ్‌ కేసులతో కాంటాక్ట్‌లో (ట్రావెల్‌ హిస్టరీ లేని వారు)వి కేటగిరీ–3గా విభజిస్తున్నాం. లక్షణాలను బట్టి వేర్వేరు ఐసోలేషన్‌ వార్డుల్లో అడ్మిట్‌ చేస్తున్నాం. చాలామంది లక్షణాలు బయటపడిన తర్వాత ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటికే రెండు మూడు రోజులవుతోంది. ఆస్పత్రికి వచ్చి న వెంటనే వీరి నుంచి స్వాబ్‌ స్వేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని వెంటనే డిశ్చార్జి చేసి, హోం కార్వంటైన్‌ సిఫార్సు చేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారిని వైరస్‌ తీవ్రతను బట్టి ఐసోలేషన్‌/ ఐసీయూల్లో అడ్మిట్‌ చేస్తున్నాం. ప్రొటోకాల్‌ ప్రకారం మందులు, ఆహరం అం దజేస్తున్నాం. ఆ తర్వాత మరో పది రోజులకు వారినుంచి మరోసారి స్వాబ్‌ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకటికి రెండుసార్లు పరీక్షలు నిర్వ హించి, వైరస్‌ పూర్తిగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్న త ర్వాతే వారిని డిశ్చార్జి చేస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు ఒక్క గాంధీ నుంచే 27 మందిని డిశ్చార్జి చేశాం.

ఏ స్టేజ్‌లో వారికి.. ఏయే మందులు వాడుతున్నామంటే..
పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు ఛాతీ ఎక్‌Šసరే, కిడ్నీ, లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్టులు, రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నాం. వీరిలో ఎక్కువ మందికి లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నాం. జ్వరం ఉంటే క్రోసిన్‌/ పారసిటమాల్‌ ఇస్తున్నాం. జలుబు ఉంటే ‘సిట్రజిన్‌’ టాబ్లెట్లు ఇస్తున్నాం. లక్షణాలు తగ్గిపోగానే వాటిని ఆపేసి విటమిన్‌ సీ, బీ కాంప్లెక్స్‌ వంటి మందులు ఇస్తున్నాం.  
దగ్గు, జలుబు, జ్వరం వంటి తీవ్ర లక్షణాలు కన్పించిన వారికి రోజుకు రెండు సార్లు ‘హైడ్రాక్సీ క్లోరిన్‌’ టాబ్లెట్స్‌ ఇస్తున్నాం. హెచ్‌ఐవీ చికిత్సల్లో ఉపయోగించే ‘లోపినవీర్‌ సహా రిటోనవీర్‌’ కాంబినేషన్‌ మందులను కూడా ఇస్తున్నాం. రెండు రోజుల తర్వాత డోస్‌ తగ్గించి మరో రెండు రోజుల పాటు అవే మందులు వాడుతున్నాం.  
నాలుగో స్టేజ్‌లో ఉన్న వాళ్లను ఐసీయూకు తరలించి చికిత్సలు అందిస్తున్నాం. ఇక్కడ 24 గంటల పాటు అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే ఐసీయూలో ఉన్నారు. వీరికి ప్రొటోకాల్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు వారి కండిషన్‌ను బట్టి చికిత్స అందిస్తున్నాం. కిడ్నీ, హార్ట్‌ పనితీరులో ఏమైనా లోపాలుంటే వెంటనే వాటికి సంబంధించిన మందులు కూడా ఇస్తున్నాం. వాటితో పాటు బీ కాంప్లెక్స్, విటమిన్‌ సీ వంటి టాబ్లెట్స్‌ కూడా ఇస్తున్నాం. 

వైద్య సిబ్బందికి కూడా..  
కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితులకు మూడు షిష్ట్‌ల్లో కలిపి సుమారు 90 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరో 300 మంది సాధారణ ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేస్తున్నారు. ఐసీయూలో పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సు, ఇతర పారామెడికల్‌ స్టాఫ్‌ మొత్తం వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాజిటివ్‌ కేసు వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్‌ సహా ఎన్‌–95 మాస్క్‌లు ధరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాతో కలిసి పని చేస్తున్న వైద్య సిబ్బంది మొత్తం వారానికి ఒకసారి ‘హైడ్రాక్సీ క్లోరిన్‌’ టాబ్లెట్‌ను వాడుతున్నాం. షిఫ్ట్‌ ముగిసిన తర్వాత కొంత మంది ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు దూరంగా ఓ గదిలో ఒంటరిగా ఉంటుంటే...మరికొంత మంది మెడికల్‌ కాలేజీ గెస్ట్‌హౌస్, హోటళ్లలో ఉంటున్నారు. తాము కూడా గత నెల రోజుల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా క్వారంటైన్‌లోనే ఉంటున్నాం.  

కోరుకున్న ఆహారం..
రోగి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ముఖ్యమే. పాజిటివ్‌ వచ్చిన బాధితులకు వారి కోరిక మేరకు ఉదయం అల్పాహారంలో టి, టిఫిన్‌ అందజేస్తున్నాం. ఇందులో కొందరు ఇడ్లీ, చపాతీ, దోశ వంటివి ఆర్డర్‌ చేస్తుంటే, మరికొందరు పాలు, బ్రెడ్డు ఆర్డర్‌ చేస్తున్నారు. రోగి ఏదీ కోరుకుంటే అదే ఆహారాన్ని అందజేస్తున్నాం.ఇక మధ్యాహ్నంఒంటి గంటకు లంచ్‌ ఇస్తున్నాం. ఇందులో రెండు రకాల కూరలు, రైస్‌ సహా పెరుగు, ఎగ్, సాంబార్‌లు అందజేస్తున్నాం. సాయంత్రం బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌తో పాటు ఇతర పండ్లను ఆహారంగా అందజేస్తున్నాం. రాత్రి డిన్నర్‌లో రైస్, చపాతీ అందజేస్తున్నాం. రోగికి దాహమేస్తే తాగేందుకు రోజుకు నాలుగు లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిళ్లను అందజేస్తున్నాం. ఆహారం అందించే విషయంలోనే కాదు రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం.  

మానసిక ధైర్యమూ ప్రధానమే..
కరోనా బారిన పడిన వారు చికిత్స కోసం ఒకే గదిలో రెండు వారాలకుపైగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారికి మందులతో పాటు మానసికంగా ధైర్యం చెప్పడం కూడా ముఖ్యమే. ఇందుకోసం సైక్రిటిస్టులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కరోనా బారిన పడిన బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్నవారే. పరిస్థితిని అర్థం చేసుకుని కొంత మంది అడ్జస్ట్‌ అవుతుంటే మరికొందరికి కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది. రోగులకు రోజుకు మూడుసార్లు రౌండ్స్‌ నిర్వహించి మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు