దేవుళ్లకు ఒత్తిళ్లు

3 Apr, 2020 07:45 IST|Sakshi

ఒకవైపు వైరస్‌ ముప్పు 

మరోవైపు రోగుల దాడులు

సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో కరోనా బాధితులు కనీస వైద్యసేవలు అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్న దయనీయమైన పరిస్థితి. మన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు కరోనా బాధితులు మాత్రం వైద్యసేవలు అందించే డాక్టర్లను హేళన చేస్తుండటం శోచనీయం. ఐసోలేషన్‌ వార్డుల్లో హంగామా సృష్టిస్తున్నారు. చికిత్సలకు సహకరించడంలేదు. వైద్యులను, స్టాఫ్‌ నర్సులపై భౌతిక దాడులకు దిగుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైద్య సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.  తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. సీఆర్‌ఫీఎఫ్‌తో రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  (ఆస్పత్రులకు క్యూ)

ట్రేసింగ్‌ కోసం వెళ్లిన వారికి సహకరించని వైనం..
ఇప్పటికే పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా చికిత్సల కోసం గాంధీకి తీసుకొచ్చారు. వీరిలో కొంత మందికి మద్యం అలవాటు ఉంది. వీరికి కొంత కాలంగా మద్యం దొరక్కపోవడంతో తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో న్యూసెన్స్‌ చేస్తుండటం వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఇక కేసుల ట్రేసింగ్‌ కోసం బాధితులు, వారి బంధువులకు ఇళ్లకు వెళ్లిన సర్వేలెన్స్‌ విభాగం అధికారులకు, స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా ప్రజలు వీరికి సహకరించడం లేదు. వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పోలీసుల సహాయంతో బాధితులకు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాల్సిన దుస్థితి నెలకొంది.  (గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్ సీరియస్)

రోగుల ఆగ్రహానికీ కారణం లేకపోలేదు..
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 127 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. మరో 16 మంది పూర్తిగా కోలుకుని ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి ఐసీయూలో 80 మంది పాజిటివ్‌ బాధితులు ఉండగా, 250 మంది వరకు అనుమానితులు ఉన్నారు. మరికొంత మందిని ఛాతీ ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రులకు తరలించారు. ఐసోలేషన్‌ వార్డుల్లో రోగుల నిష్పత్తి తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు మాత్రం వాటిని పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు లేని ఐసోలేషన్‌ వార్డుల్లో రోజుల తరబడి ఉంచడం రోగుల్లో అసహనానికి, ఆగ్రహానికి కారణమవుతోంది. వైరస్‌కు మందు లేకపోవడం, బాధితుల్లో మల్టీఫుల్‌ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉండటం, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చికిత్స చేసిన ఫలితం లేకుండాపోతోంది. కళ్లముందే కుటుంబ సభ్యులు మృతి చెందుతుండటంతో వారు జీర్ణించు కోలేకపోతున్నారు. దీంతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.  (కరోనా: అపోహలూ... వాస్తవాలు)

భారమంతా ‘గాంధీ’పైనే..  
గాంధీ ఆస్పత్రి ఇన్‌పేషెంట్‌ విభాగంలోని 7, 8వ అంతస్తుల్లో తొలుత 40 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్‌ రోగుల రద్దీ దృష్ట్యా ఆస్పత్రిలోని ఇతర రోగులను పూర్తిగా ఖాళీ చేయించి ఉస్మానియా, ఇతర ఆస్పత్రులకు తరలించారు. 1,500 పడకల సామర్థ్యంతో గాంధీని పూర్తిస్థాయి కరోనా చికిత్సల కేంద్రంగా ఏర్పాటు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు హోం ఐసోలేషన్‌కు పంపుతున్నారు. కరోనా చికిత్సల కోసం ఫీవర్, కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రుల్లోని పలు పడకలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ప్పటికీ.. ఎక్కువ శాతం భారం గాంధీ ఆస్పత్రిపైనే పడుతోంది. దీంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.  

భయాందోళనతో విధులు.. 
ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్యులు ఇప్పటికే వైరస్‌ బారిన పడటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గాంధీలో పని చేస్తున్న వై ద్యులు ఒక వైపు రోగిని కాపాడుతూనే మరోవైపు తమను తాము కాపాడుకునేందుకు వైరస్‌తో పోరాడుతున్నారు. ఇంకోవైపు రోగుల బంధువుల భారీ నుంచి కాపాడుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐసోలేషన్‌ వార్డుల్లోని రోగులకు వైద్య సేవలు అందిచేందుకు పలువురు రెసిడెంట్‌ డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరిన్ని వార్తలు