‘గాంధీ’లో అదే నిర్లక్ష్యం!

20 Feb, 2020 10:11 IST|Sakshi
గర్భిణికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ రాజారావు

స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌తో వచ్చిన గర్భిణిని పట్టించుకోని వైనం  

ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి మెమోలు  

సిజేరియన్‌ డెలివరీ చేసిన వైద్యులు

గాంధీఆస్పత్రి : ఎన్ని విమర్శలు వస్తున్నా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రాణాపాయస్థితిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌తో వచ్చిన గర్భిణిని పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆస్పత్రి పాలనా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పలువురు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పీజీలకు మెమోలు జారీ చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్, జమ్మికుంటకు చెందిన నిండు గర్భిణి తీవ్రమైన జ్వరం, జలుబుతో మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బుధవారం అర్ధరాత్రి 12.30 రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆమెకు తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. అయితే ఆ సమయంలో సదరు వార్డులో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పీజీ, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతోపాటు మీడియాకు సమాచారం అందించారు.

ఉన్నతాధికారుల సూచన మేరకు గాంధీ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు బుధవారం ఉదయం విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్యసేవల్లో జాప్యం జరిగిన విషయం వాస్తమేనన్నారు. గర్భిణికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ రావడంతో బుధవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో అడ్మిట్‌ చేశామన్నారు. స్వైన్‌ఫ్లూతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న ఆమెకు అర్ధరాత్రి 1.45కు ఫిజీషియన్, 3 గంటలకు గైనకాలజీ డాక్టర్లు చికిత్స అందించారన్నారు. అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది, పీజీలు అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. అయితే,  డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ వాష్‌రూంకు వెళ్లాడని, నర్సులు వార్డులోని గదిలో ఉన్నారని, పీజీలు ఇతర రోగుల పనిపై వివిధ విభాగాలకు వెళ్లినట్లు తేలిందన్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న  వైద్యులు, నర్సులు, పీజీలకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై  డీఎంఈ రమేష్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. తానే స్వయంగా గర్భిణికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సిజేరియన్‌ చేసి శిశువును బయటకు తీసి ఎన్‌ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు.  వెంటిలేటర్‌పై ఉన్న తల్లి పరిస్థితి విషమంగా ఉందన్నారు.  స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిమిత్తం శిశువు    నుంచి నమూనాలు సేకరించామన్నారు. గాంధీ నర్సింగ్‌ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

70 మంది కోవిడ్‌ అనుమానితులకు వైద్యపరీక్షలు...
గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరిన 70మంది కోవిడ్‌ అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ వచ్చిందని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ఇద్దరు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ రోగులతోపాటు మరో ఐదుగురు అనుమానితులకు డిజాస్టర్‌ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు